9 June, 2026 | 1:24 AM

మహిళల భద్రత, రక్షణకు షీ టీమ్

09-06-2026 12:40 AM

జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి

హాజీపూర్, జూన్ 8 : మహిళల భద్రత, రక్షణకు షీ టీమ్ అందుబాటులో ఉంటుందని జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి పేర్కొన్నారు. ప్రజాపాలనప్రగతి ప్రణాళికలో భాగంగా సోమ వారం హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ ప్రజలకు షీ టీమ్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్ మాట్లాడారు.

మహిళలు, యువతులు సమాజంలో, కార్యాలయాల్లో, సామాజిక మాధ్యమాల్లో, ఇతర వ్యక్తుల ద్వారా ఎదుర్కొనే వేధింపులు ప్రస్తుతం ఒక ప్రధాన సమస్యగా ఉన్నాయని, అనేక సందర్భాల్లో కుటుంబ గౌరవం, భయం లేదా ఇతర కారణాల వల్ల మహిళలు తమకు ఎదురైన వేధింపులను బయటపెట్టలేకపోతున్నారని, ఇలాంటి వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు శాఖ, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, షీ టీమ్స్ వంటి ప్రత్యేక విభాగాలు మహిళల భద్రత, రక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉన్నాయన్నారు.

ప్రయాణాల సమయంలో, బస్స్టాప్లు, రైల్వే స్టేషన్లు, కాలనీలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించడం, వెంబడించడం, అసభ్యకరంగా మాట్లాడడం, అసభ్య సైగలు చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి బెదిరింపులకు పాల్పడడం వంటి వేధింపులకు గురైనప్పుడు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇలాంటి సంఘటనలపై రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్ నంబర్ 8712659385 లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాడి వెంకటేష్, వ్యవసాయ విస్తరణ అధికారి కొమురయ్య, పంచాయతీ కార్యదర్శి రూపాదేవి, మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.