18-08-2025 03:04:44 PM
సహయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం
ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చిన అధికారులు, నాయకులు
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మంజీరా నది(Manjeera River)లో గొర్రెల కాపరులు, గోర్రేలు చిక్కుకున్నాయి. మంజీరా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో పాటు నిజాం సాగర్ నుంచి నీటి విడుదల జరగడంతో నదిలో కాపరులు, మూగజీవాలు చిక్కుకున్న ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామ శివారులోని మంజీరా నదిలో షెట్లూర్ గుండె కల్లూరు గ్రామాలకు చెందిన ముగ్గురు గొర్రెల కాపరులు, 400 గొర్రెలు చిక్కుకున్నట్లు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు రంగంలోకి దించి నీటిలో చిక్కుకున్న నలుగురు గొర్రెల కాపరులతో పాటు ఇద్దరు రైతులను కాపాడి వారిని ఒడ్డుకు చేర్చారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. గొర్రెల కాపర్లు ఒడ్డుకు చేరడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.