18-08-2025 04:23:37 PM
రేవంత్ రెడ్డి చేతకాని పాలనతో గుజరాత్ కు తరలిన రూ.2,800 కోట్ల 'కేన్స్' పెట్టుబడి
2 వేల మంది తెలంగాణ యువత ఉద్యోగాలకు గండి కొట్టిన రేవంత్ సర్కార్
బూడిదలో పోసిన పన్నీరుగా పదేళ్ల బీఆర్ఎస్ శ్రమ
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం, నిర్లక్ష్యపు పాలనా విధానాలతోనే తెలంగాణకు రావాల్సిన భారీ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో శ్రమించి రాష్ట్రానికి తీసుకొచ్చిన రూ.2,800 కోట్ల పెట్టుబడి, 2 వేల ఉద్యోగాల సామర్థ్యం గల కేన్స్ టెక్నాలజీ(Kaynes Technology) సెమీకండక్టర్ల పరిశ్రమ కాంగ్రెస్ సర్కార్ అసమర్థత కారణంగా గుజరాత్‌కు తరలిపోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా పరిశ్రమలు తరలిపోతున్నా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కనీసం స్పందించడం లేదన్నారు. గతంలో తమ ప్రభుత్వం ఎంతో శ్రమించి కర్ణాటకకు వెళ్లాల్సిన కేన్స్ పరిశ్రమను తెలంగాణకు రప్పించిందన్న కేటీఆర్, వారు కోరిన వెంటనే పది రోజుల్లోనే కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ పక్కనే భూములు కేటాయించామని తెలిపారు.
తమ పారదర్శక పాలన, చిత్తశుద్దితో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఆ సంస్థ, నేడు కాంగ్రెస్ అవినీతి, అసమర్థ పాలన కారణంగానే రాష్ట్రం విడిచి వెళ్లిపోయిందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి ఆటో-పైలట్ మోడ్‌లో ఉంటే ఇవాళ రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక ఆటో-డిస్ట్రక్షన్(స్వయం విధ్వంసక) మోడ్‌లోకి వెళ్లిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. పదేళ్లపాటు కష్టపడి 'బ్రాండ్ హైదరాబాద్', 'బ్రాండ్ తెలంగాణ' ఇమేజ్‌ను బీఆర్ఎస్ నిర్మిస్తే, కొద్ది నెలల్లోనే దానిని కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల మీద తప్ప పరిశ్రమలను నిలుపుకోవడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగాల కల్పనలను పూర్తిగా గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, విచ్చలవిడిగా తెలంగాణ సంపదను దోచుకుంటుందని కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణను ఏటీఎంగా మార్చి, ఇక్కడి సంపదను వారికి తరలించడం అనే పని మాత్రమే ఇవాళ ఆటో-పైలట్ మోడ్‌లో నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు.
తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీ పెద్దలకు తెలంగాణను రేవంత్ రెడ్డి తాకట్టుపెట్టారని ఆరోపించారు. పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను మార్చేందుకు గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రమించిందని కేటీఆర్ అన్నారు. టీఎస్-ఐపాస్ వంటి విప్లవాత్మక విధానాలతో ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించిందని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆ కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'కేన్స్' టెక్నాలజీ సంస్థ గుజరాత్‌కు తరలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు ఒక హెచ్చరిక మాత్రమే అన్న కేటీఆర్, ఇప్పటికైనా రేవంత్ కళ్లు తెరిచి పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాలని సూచించారు. లేకపోతే మరిన్ని కంపెనీలు రాష్ట్రం విడిచిపోయే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు.