18-08-2025 02:48:40 PM
కాలనీలలో, ఎంసీహెచ్ లోకి వరద నీరు
మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలో సోమవారం కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని కాలనీలు, ఎంసీహెచ్ వరదమయం అయ్యాయి. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరద నీరు పట్టణంలోని సూర్య నగర్, హమాలి వాడ, తిలక్ నగర్, బృందావన కాలనీ, సున్నం బట్టి వాడ, హైటెక్ సిటీ తదితర వాడల్లోని ఇళ్లలోకి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం అతలాకుతలం అయ్యింది. రోడ్లపైకి నీరు చేరడంతో జనం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పట్టణానికి ఆనుకుని ఉన్న రాళ్లవాగు, తోళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
వరదమయంలో ఎంసీహెచ్...
కాలేజీ రోడ్ లోని ఎంసీహెచ్ వరదమయం అయ్యింది. ఆసుపత్రి చుట్టూ వరద నీరు వచ్చి చేరుతోంది. ఆసుపత్రిలోకి రావడానికి, బయటకు వెళ్లేందుకు రోగులు, అటెండర్ లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విష సర్పాలు ఆసుపత్రి వరకు వస్తుండటంతో భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడ నుంచి పాములు వస్తాయోనని భయం గుప్పిట్లో గడుపుతున్నారు.