గొర్రెల స్కీం డీడీలు వాపస్!
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ
వనపర్తి, జూన్ 10 (విజయక్రాంతి): కులవృత్తుల వారికి గత ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాల్ని అమలు చేశారు. గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదటి విడత పూర్తి కాగా రెండవ విడత పంపిణీకి సిద్ధమవుతున్న వేళ అసెంబ్లీ ఎన్నికలతో బ్రేక్ పడింది. అప్పటికే లబ్ధిదారు లు తమ వాటా ధనాన్ని డీడీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు. ఇదిలా ఉండగా, ఈ స్కీంలో అక్రమాలు జరిగాయనే ఫిర్యా దులు వెల్లువెత్తడంతో స్కీంపై నీలినీడలు అలుముకున్నాయి. కాగా, తాజా ప్రభుత్వం రెండోవిడత లబ్ధిదారులు చెల్లించిన వాటా ధనంను తిరిగి వాపస్ చేయాలని ఆదేశించింది. దీంతో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు లబ్ధిదారుల ఖాతాల్లో వాటా నగదును జమ చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా వివరాలు...
జిల్లా వ్యాప్తంగా రెండవ విడత గొర్రెల పంపిణీ పథకం కోసం 3201 డీడీలు చెల్లించారు. ఇప్పటికే 2580 డీడీల నగదు వాపస్ చేయగా, 73 డీడీ డబ్బులు ఇవ్వాల్సి ఉంది, అందులో 53 కలెక్టర్ అనుమతి రాగానే వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, మిగిలిన 20 డీడీల వాపస్ పెండింగ్ లో ఉన్నట్లు పశుసంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.






