పెండింగ్‌లో అంగన్‌వాడీ కేంద్రాల అద్దె
పది నెలలుగా నిలిచిన బిల్లులు
నిరాశలో భవనాల యజమానులు
వనపర్తి, జూన్ ౧౦ (విజయక్రాంతి): అంగన్‌వాడీ అద్దె భవనాలు చెల్లించలేక ఎప్పుడు బిల్లులు మంజూరు అవుతాయో తెలియక యజమానులకు ఏం సమాధానం చెప్పాల్లో అర్థంకాక అంగన్‌వాడీ టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 589 ఉన్నాయి. వీటిలో 127 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
గత సంవత్సరం ఆగస్టు నెల వరకు అద్దె చెల్లింపులు జరగగా, సెప్టెంబర్ నుండి ఈ ఏడాది మే నెల వరకు అద్దె చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో భవనాల యజమానులు అంగన్‌వాడీ టీచర్లపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలల, అంగన్‌వాడీ కేంద్రాల పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు చెల్లించాల్సిన భవనాల్లో కే్రందాలు తెరుచుకుంటాయా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది.
అద్దె ప్రతిపాదనలు పంపాం
గత సంవత్సరం ఆగస్టు నెల వరకు అద్దె భవనాలకు చెల్లింపులు జరిగాయి. సెప్టెంబర్ నుండి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు చెల్లింపుల విషయమై ప్రతిపాదనలు పంపాం. బడ్జెట్ మంజూరు కాగానే భవనాల అద్దె చెల్లింపులు పూర్తి చేస్తాం.
లక్ష్మీబాయి, డీడబ్ల్యూవో, వనపర్తి జిల్లా






