31 August, 2026 | 2:31 AM

సింగిల్ విండో విధానంతో షూటింగ్ అనుమతులు సులభతరం

31-08-2026 12:00 AM

ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్ 

‘ఏపీలో సినిమా షూటింగులకు అనుమతులు సులభంగా లభించేలా సింగిల్ విండో విధానం తీసుకురానున్నామని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్ తెలిపారు. భీమిలి సాగర తీరంలోని తిమ్మాపురం వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో సినీ సెలబ్రిటీ గాలా ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్‌డీసీ) ఛైర్మన్ భరత్ భూషణ్, వైస్ ఛైర్మన్, ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్, హీరోయిన్ హెబ్బా పటేల్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 12 ఏళ్లకు ఏర్పడిన ఏపీఎఫ్‌డీసీ కమిటీ సభ్యులను వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ కమిటీ సభ్యులు, టాలెంట్ రియల్ స్టూడియో ప్రతినిధులు సన్మానించారు. టాలెంట్ ప్రొడక్షన్స్, కంటిపూటి క్రియేషన్స్ పేరుతో రెండు నూతన సినీ నిర్మాణ సంస్థలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ.. “అమరావతి అభివృద్ధితోపాటు ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని కూడా మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

విశాఖపట్టణాన్ని సినీ రంగానికి ముఖ్యకేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. విశాఖలో డబ్బింగ్ థియేటర్లను అభివృద్ధి చేయడంతోపాటు, త్వరలో జాతీయ స్థాయి అవార్డుల వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తాం. సినిమా షూటింగులకు అనుమతులు సులభంగా లభించేలా సింగిల్ విండో విధానం తీసుకురానున్నాం. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో సినిమా షూటింగ్స్ జరిగేలా చర్యలు తీసుకుంటాం.

చిన్న సినిమాలే సినీ పరిశ్రమకు బలం, వాటి వల్లే పరిశ్రమలో కొత్త ప్రతిభకు అవకాశాలు లభిస్తున్నాయి. సినిమాలో మంచి విషయం, బలమైన కంటెంట్ ఉంటే ఎవరితో సినిమా తీశారనేది పెద్దగా ముఖ్యం కాదు” అన్నారు. మెహర్ రమేశ్ మాట్లాడుతూ.. “విశాఖపట్నం త్వరలో సినిమా రాజధానిగా మారబోతోంది. మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంతోపాటు, భవిష్యత్‌లో పెద్ద సంఖ్యలో సినిమా షూటింగ్స్ జరిగేలా కృషి చేస్తున్నాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఎఫ్‌డీసీ బాధ్యులు సుమన్, శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, సాయిబాబా బుర్ర, ఝాన్సీ, సముద్ర, సత్యనారాయణ, చిత్ర పరిశ్రమకు చెందిన టీఎస్‌పీసీ సెక్రెటరీ తుమ్మల ప్రసన్నకుమార్, టీఎఫ్‌డీఏ ప్రెసిడెంట్ వీఎన్ ఆదిత్య, ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, దర్శక నటుడు విశ్వనాథ్, దర్శకనిర్మాత సాయిరాజేశ్ తదితరులు పాల్గొన్నారు.