28 July, 2026 | 9:16 AM

బెంగాల్‌ను కుదిపేసిన రెమాల్

28-05-2024 12:05 AM

తీవ్ర తుఫాన్ ధాటికి ఇద్దరు మృతి

తుఫాన్‌ను వీడియో తీసిన ఓ ఫొటోగ్రాఫర్

సోషల్‌మీడియాలో వైరల్ 

కోల్‌కతా, మే 27: సాధారణ తుఫాన్ అంటేనే ప్రజలు భయపడిపోతారు. ఇక తీవ్ర తుఫాన్ వస్తుందంటే అందరూ ఎవరికి వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి అది తొలగిపోయేవరకు దాక్కుంటారు. కానీ, ఓ ఫొటోగ్రాఫర్ తొలిసారి తుఫాన్‌కు ఎదురెళ్లాడు. బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ మధ్య ఆదివారం రాత్రి తుఫాన్ తీరం దాటుతుందనగా, ప్రజలంతా ఇండ్లకే పరిమితమైన సమయంలో ఆదివారం సాయంత్రం అతనొక్కడే సముద్రంలోకి వెళ్లాడు. భీకరమైన ఉరుములు, మెరుపులు, పట్టపగలే చీకటిని సృష్టించిన నల్లని మేఘాలను చూసి ఏమాత్రం భయపడలేదు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నా చిన్న బోటుపై నిలబడి తుఫాన్ కేంద్రకాన్ని (సైక్లోన్ ఐ) నిర్భయంగా వీడియో తీశాడు. బంగ్లాదేశ్ దినపత్రిక డైలీ స్టార్ వీడియోగ్రాఫర్ తీసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది.   

భారీ వర్షాలకు ఇద్దరు మృతి

రెమాల్ తుఫాన్ ఆదివారం రాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. దీంతో రెండుప్రాంతాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సాగర్ దీవి, ఖెపుపారా మధ్య తీరం దాటిన తుఫాను క్రమంగా బలహీనపడుతున్నది. తుఫాను ధాటికి బెంగాల్‌లో ఇద్దరు చనిపోయారు. రెండు దేశాల్లో తీవ్ర ఆస్తినష్టం సంభవించింది.