8 May, 2026 | 1:04 AM

పార్టీ మారాలా.. వద్దా?

23-06-2024 02:43 AM
  • కార్యకర్తలు, ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ఎర్రబెల్లి!

మారితే ఏ పార్టీలో చేరాలనే దానిపై తర్జనభర్జన

పాలకుర్తిలో అత్తాకోడళ్లకు చెక్ పెట్టేందుకు దయాకర్‌రావు స్కెచ్?

పాలకుర్తి/జనగామ, జూన్ 2౨ (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తిరుగులేని రాజకీయ నాయకుడిగా పేరు గడించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికార పక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉండేది. టీడీపీలో సుధీర్ఘకాలం కొనసాగిన ఆయన ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చక్రం తిప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ సునామీలోనూ సమైక్యాంధ్ర పార్టీగా ముద్ర పడిన టీడీపీ టికెట్ తీసుకుని పాలకుర్తి నుంచి ఆయన గెలుపొందారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యేగా మూడుసార్లు, పాలకుర్తి ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచి ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్ నుంచి గెలవడమే కాకుండా మంత్రిగా కూడా పనిచేశారు. అంతటి ఘనకీర్తి కలిగిన ఎర్రబెల్లికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన 26 ఏళ్ల యువతి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. దశాబ్దాల కాలంగా ఎర్రబెల్లి కంచుకోటగా మార్చుకున్న పాలకుర్తిలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఆయన  ఓడిపోవడంతో పాటు తన పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో దెబ్బ మీద దెబ్బ పడినట్లుంది. దీంతో పాలకుర్తిలో పూర్తిగా ఆయన ఆధిపత్యం లేకుండా పోయింది. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని ఎర్రబెల్లి బీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారంటూ అనేక వార్తలు వస్తున్నాయి. 

కార్యకర్తలతో రహస్య సమావేశం

ఎర్రబెల్లి పార్టీ మారుతానే ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో ఓ రహస్య సమావేశం ఈ వార్తలకు ఊతమిచ్చినట్లు అవుతోంది. మూడు దశాబ్దాలుగా పటిష్టంగా ఉన్న ఎర్రబెల్లి క్యాడర్ ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరగా, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. ఒక్కొక్కరు పార్టీని వీడుతున్న క్రమంలో ఎర్రబెల్లి డైలామాలో పడ్డట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఆయన పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో వర్ధన్నపేటలోని తన నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మెజారిటీ అనుచరులు కాంగ్రెస్‌లో చేరాలని సూచిస్తుండగా.. కొందరు బీజేపీలో చేరాలని ఎర్రబెల్లికి చెబుతున్నట్లు సమాచారం.

వేం నరేందర్‌రెడ్డి ద్వారా మంతనాలు

గతంలో సీఎం రేవంత్‌రెడ్డికి, ఎర్రబెల్లికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అలాంటిది ఎర్రబెల్లిని కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి రానిస్తారా లేదా? అనే చర్చ ఓ వైపు జరుగుతోంది. అయితే.. రేవంత్‌రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ఎర్రబెల్లికి మంచి మిత్రుడు కావడంతో ఆయన ద్వారా మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. వేం నరేందర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి కూడా సన్నిహితుడు కావడంతో ఆయన ద్వారా ఎర్రబెల్లి చర్చలు జరుపుతున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఎర్రబెల్లిని కాంగ్రెస్‌లోకి రానివ్వద్దంటూ యశస్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డి ఢిల్లీ పెద్దలను కలిసి విన్నవించుకున్నట్లు సమాచారం.