‘కవిశ్రీ’ బిరుదుతో రాష్ట్రస్థాయిలో మెరిసిన శ్యామల లింగారెడ్డి
మొండికుంటకు సాహితీ గౌరవం.. రవీంద్రభారతిలో ఘన సన్మానం
అశ్వాపురం, జూన్ 21 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన ప్రముఖ కవి శ్యామల లింగారెడ్డి రాష్ట్రస్థాయి సాహిత్య వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో మహతి సాహితీ కవిసంగమం 6వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘సాహితీ సంగ్రామం కవి సమ్మేళనం‘లో 2026 సంవత్సరానికి గాను ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన ‘కవిశ్రీ‘ బిరుదును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
సమాజ చైతన్యాన్ని ప్రతిబింబించే ’అమ్మధరిత్రి’, ’పల్లెలే మన తల్లులు’, ’మేధావిమౌనం’, ’ఉగ్రవాదం’, ’చీకటివెలుగులు’, ’అరణ్యంజనారణ్యం’ వంటి పలు భావగర్భిత కవితలు ఆయనకు ఈ గౌరవాన్ని తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన ‘శ్రీ కవితా సంకలనం‘ లో శ్యామల లింగారెడ్డి రచించిన ’ఓ విద్యార్థి’, ’నా కలం’, ’ఓ మేఘమా’, ’అన్నదాత’, ’అమ్మ గోమాత’, ’మంచిగా మసులుకో’, ’పిల్లలం మేము బడి పిల్లలం’, ’రైతన్న’, ’సమాజమా’ తదితర సమాజ చైతన్యాన్ని పెంపొందించే కవితలు చోటు చేసుకున్నాయి.
ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ జానపద కళా అకాడమీ పూర్వ అధ్యక్షులు కళారత్న పొట్లూరి హరికృష్ణ, సినీ గీత రచయిత సాధనాల వెంకటస్వామి నాయుడు, పొట్లూరి చంద్రశేఖరరావు, భవానీ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్, మహతి సాహితీ కవిసంగమం అధ్యక్షులు డా. అడిగొప్పుల సదయ్య, ప్రధాన కార్యదర్శి పొర్ల వేణుగోపాలరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో ‘కవిశ్రీ‘ బిరుదు అందుకోవడం పట్ల మొండికుంట గ్రామంతో పాటు అశ్వాపురం మండల ప్రజలు, సాహితీవేత్తలు, కవులు శ్యామల లింగారెడ్డిని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.






