ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుళ్లపై వేటు

20-04-2024 01:45:24 AM

పట్టుకున్న గంజాయిని కాపాడకపోవడంతో చర్యలు 

జగిత్యాల, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): పట్టుకున్న గంజాయి పరిరక్షించలేని జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్సైలు, ఓ హెడ్ కానిస్టేబుల్,  మరో కానిస్టేబుల్‌పై  సస్పెన్షన్ వేటు వేస్తూ మల్టీ జోన్‌ఛీ ఐజీ ఎంవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2023 ఫిబ్రవరి 1న ఏపీలోని విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌కు  అంబులెన్స్‌లో తరలిస్తున్న 70 కేజీల గంజాయిని  సారంగాపూర్ పోలీసులు పట్టుకు న్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయిని పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు. అయితే ఆ 70 కిలోల  గంజాయి మాయమైనట్టు ఈ నెల 1న తెలిసింది.

పోలీసుల నిర్లక్ష్యాన్ని సీరియస్‌గా తీసుకున్న  జగిత్యాల  ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్  సమగ్ర విచారణ చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై మల్టీ జోన్‌వే ఐజీ ఎంవీ రంగనాథ్‌కు నివేదికను పంపించారు. దీంతో బాధ్యులైన ఎస్సైలు జీ మనోహర్‌రావు, ఏ తిరుపతి, హెడ్‌కానిస్టేబుల్ బీ రవీందర్‌రెడ్డి, కానిస్టేబుల్ టీ నరేందర్‌ను సస్పెండ్ చేస్తూ  ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు పర్యవేక్షణలో ఉన్న 70 కిలోల గంజాయిని ఇదే మండలానికి చెందిన మైనర్లు ఠాణా నుంచి మాయం చేసినట్టు తెలిసింది. నలుగురు మైనర్లను  పోలీసులు  అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నట్లు సమాచారం