30 March, 2026 | 10:47 PM

ధర్మారంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

30-03-2026 08:57 PM

– ఎస్సై ప్రశాంత్ రెడ్డి సూచనలు

కోనరావుపేట(విజయక్రాంతి): కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై కే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ధర్మారం గ్రామంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ARRIVE ALIVE కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై ప్రశాంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, రోడ్డు భద్రతకు సంబంధించిన ముఖ్యమైన నియమాలను వివరించారు.

రోడ్డుపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను రక్షించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.