17 April, 2026 | 4:52 AM

కోలిండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాలి

04-11-2025 08:04 PM

ఏరియా జిఎం రాధాకృష్ణ..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కళాకారులు, క్రీడాకారులు కోలిండియా స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో, సాంస్కృత కార్యక్రమాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి, దేశవ్యాప్తంగా సింగరేణి ఖ్యాతిని చాటాలని ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ కోరారు. పట్టణంలోని సీఈఆర్ క్లబ్ లో మంగళవారం వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్(డబ్ల్యుపిఎస్ అండ్ జిఏ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న సింగరేణి స్థాయి సాంస్కృతిక పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, సింగరేణి అధికారులు, యూనియన్ ప్రతినిధులతో కలిసి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వల చేసి, అనంతరం నటరాజ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం కార్మికుల ఉద్యోగుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని వివరించారు. ఉద్యోగుల ఆరోగ్య విషయంలో, శారీరక, మానసిక ఉల్లాసం కొరకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సింగరేణి ఏరియాలైన మణుగూరు నుండి గోలేటి ఏరియాల వరకు కంపెనీ లెవెల్ సాంస్కృతిక పోటీలు ఏరియాలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని హర్ష్యం వ్యక్తం చేశారు. కళాకారులందరూ తమ ప్రతిభ ప్రావీణ్యాలను కనబరిచి, బహుమతులు సాధించి, వారి ఏరియాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

గెలుపొందిన కళాకారులు కోల్ ఇండియా పోటీల్లో పాల్గొని, సింగరేణికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారా యణ, సిఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు రమేష్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏరియా క్రీడల గౌరవ కార్యదర్శి, సీనియర్ పిఓ ఎం కార్తీక్, ఏరియాల క్రీడా సూపర్వైజర్లు డి జాన్ వెస్లీ, సిహెచ్ అశోక్, ఎం నరేందర్ రెడ్డి, పరస శ్రీనివాస్, హెచ్ రమేష్, ఏరియా క్రీడల సంయుక్త కార్యదర్శి శివకృష్ణ, అన్ని ఏరియాల కల్చరల్ కోఆర్డినేటర్లు, కళాకారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.