దేవదుర్గలో అన్వేషణకు సింగరేణి
- రాయచూర్, యాదగిరిలో బంగారం, రాగి
- కేఆర్‌ఎంజీతో ఒప్పందం
- ఐదేళ్లలో పూర్తి: సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): సింగరేణి సంస్థ కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్, యాదగిరి జిల్లాల్లో విస్తరించి ఉన్న దేవదుర్గ బ్లాక్‌లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణలో మరో కీలక ముందడుగు వేసింది. గతంలో ఈ అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ వేలంలో లైసెన్స్ పొందిన నేపథ్యంలో, ఇప్పుడు అన్వేషణ పనులు ప్రారంభించేందుకు కర్ణాటక రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖతో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం, సింగరేణి సంస్థకు లైసెన్స్ లభించిన దేవదుర్గ ప్రాంతంలోని 199.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అన్వేషణను ఐదేళ్లలో పూర్తి చేయడానికి అంగీకారం కుదిరింది. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేవదుర్గలో ఖనిజాన్వేషణకు అధికారులు, సిబ్బందిని కూడా నియమించామని, త్వరలో మిగతా వారిని కూడా నియమిస్తామని, రెండేళ్లలోపు జీ అన్వేషణను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పనుల అనంతరం నమూనాల సేకరణ, అధ్యనాలు, విశ్లేషణలు నిర్వహిస్తామన్నారు. అనంతరం నివేదిక సమర్పణ, విస్తృతస్థాయి అన్వేషణ చేపట్టే అవకాశం ఉంటుంది.






