8 August, 2026 | 1:15 AM

సంక్షోభాలను అవకాశాలుగా మల్చుకోవాలి

08-08-2026 12:00 AM

పాలిమర్ రంగానికి అండగా ప్రభుత్వం

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల ను సవాళ్లుగా కాకుండా కొత్త అవకాశాలుగా మలుచుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

సంక్షోభ సమయాల్లోనే కొత్త సాంకేతికత, నాణ్యత, ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టే పరిశ్రమలే భవిష్యత్తులో మార్కెట్‌ను శాసిస్తాయని అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన హిప్లెక్స్ ప్లాస్టిక్స్, పాలిమర్స్, ప్రాసెసింగ్ టెక్నాలజీ, యంత్రాల అంతర్జాతీయ ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పరిశ్రమల ప్రదర్శనల్లో తనకు యంత్రాలు మాత్రమే కనిపించవని, వాటి వెనుక వేలాది కుటుంబాల జీవనోపాధి, దేశాభివృద్ధికి కృషి చేస్తున్న పారిశ్రామికవేత్తల సంకల్పం, యువత భవిష్యత్తు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థి తులు ఎదురైనా పెట్టుబడులు, విస్తరణ, ఆవిష్కరణలను కొనసాగిస్తున్న పరిశ్రమల ఆత్మవిశ్వాసమే భారతదేశ బలమన్నారు.

ప్లాస్టిక్స్, పాలిమర్ పరిశ్రమ దేశ తయారీ రంగంలో అత్యంత కీలకమైందని తెలిపారు. గృహనిర్మాణం, తాగునీటి సరఫరా, వ్యవసాయం, వైద్యరంగం, ఔషధ తయారీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆహార ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాల రంగాలకు అవసరమైన ముడి పదార్థాలను ఈ రంగమే అందిస్తోందన్నారు. దేశవ్యాప్తం గా ఈ పరిశ్రమ ద్వారా 50 లక్షల మందికి ప్రత్యక్షంగా, కోటికి పైగా మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని తెలిపారు. తెలంగాణలోనే సుమారు రెండు లక్షల మంది జీవనోపాధి ఈ రంగంపై ఆధారపడి ఉందని వివరించారు.

పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. ఏఐపీఎంఏ, టాప్మా, ఐపీఐ వంటి పరిశ్రమల సంఘాలు వి ధానపరమైన అంశాలు, మౌలిక సదుపాయాల అవసరాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర ప్రతిపాదన లు అందిస్తే ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి విధానపరమైన సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఎదిగిందన్నారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, గ్లోబల్ కె పబిలిటీ సెంటర్లు, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో సాధించిన విజయాలను పాలిమర్ రంగంలోనూ పునరావృతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి సుమారు 13 లక్షల టన్నుల పాలిమర్ వినియోగం ఉందన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు సమన్వయంతో పనిచేస్తే 2030 నాటికి ఇది 20 లక్షల టన్నులకు పైగా చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పెట్టుబడులు కొనసాగిస్తూ ఉపాధి అవకాశాల ను సృష్టించాలని, ప్రతి అడుగులోనూ రాష్ట్ర ప్రభుత్వం  పరిశ్రమలకు అండగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.