27 May, 2026 | 12:29 AM

మియాపూర్‌లో ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ ప్రారంభం

27-05-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటు

శేరిలింగంపల్లి, మే 26 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ప్రజల ఎన్నికల సంబంధిత సందేహాల నివృత్తికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్- 48, మియాపూర్ కార్యాలయంలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ హెల్ప్ డెస్క్’ను ఏర్పాటు చేసినట్లు ఉప కమిషనర్ శశిరేఖ వెల్లడించారు.

ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, సవరణలు, చిరునామా మార్పులు, కొత్త ఓటరు గుర్తింపు కార్డులకు దరఖాస్తు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు తక్షణమే దరఖాస్తులు స్వీకరించేందుకు ఈ హెల్ప్ డెస్క్ దోహదపడుతుందని ఆమె తెలిపారు.

ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైన వారికి సిబ్బంది సహాయం అందిస్తారని, అవసరమైన పత్రాలతో నేరుగా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకొని 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఉప కమిషనర్ శశిరేఖ విజ్ఞప్తి చేశారు.