మలేరియా పరాన్నజీవిని గుర్తించిన తొలి సైంటిస్ట్ సర్ రోనాల్డ్ రాస్
(నేడు రోనాల్డ్ రాస్ జయంతి) :
సర్ రోనాల్డ్ రాస్ 1857 మే 12న ఇంగ్లాండ్‌లో జన్మించారు. వైద్యరంగానికి ఆయన అందించిన సేవలు యావత్ ప్రపంచానికి సేవలు చేశాయి. మలేరియా సంక్రమణపై ఆయన చేసిన పరిశోధన వైద్యరంగంలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆడ అనాఫిలెస్ దోమలు కుట్టడం వల్ల మలేరియా పరాన్నజీవులు మనిషికి సంక్రమిస్తాయని, తద్వారా మనిషి మలేరియా బారిన పడతారని ఆయన కనుగొన్నారు.
ఆయన పరిశోధనలకు గాను 1902లో ఆయన మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. నోబెల్ బహుమతి అందుకున్న తొలి బ్రిటిష్ శాస్త్రవేత్త ఆయనే కావడం మరో విశేషం. భారతదేశంతో సర్ రొనాల్డ్ రాస్‌కు ఎంతో అనుబంధం ఉంది. ఆయన తండ్రి సర్ క్యాంప్‌బెల్ రాస్ అప్పట్లో బ్రిటిష్ ఆర్మీలో పనిచేశారు. కా్ంయప్‌బెల్ మటిల్డా దంపతులకు ఆయన జన్మించారు.
1881లో ఇండియన్ మెడికల్ సర్వీస్‌లో చేరిన రాస్ తర్వాత మలేరియాపై అనేక పరిశోధనలు చేశారు. సికింద్రాబాద్ కేంద్రంగా ఆయన తన పరిశోధనలు కొనసాగించారు. 1897 ఆగస్టు 2న ఆయన మొదటిసారిగా సికింద్రాబాద్‌లో జ్వరంతో బాధపడుతున్న రోగి రక్తం పీల్చిన స్త్రీ అనోఫిలెస్ దోమ కడుపులో మలేరియా పరాన్నజీవిని కనుగొన్నారు.
ఆయన కృషి ప్రపంచ వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేసింది. 16 సెప్టెంబర్ 1932 కన్నుమూశారు. వైద్య రంగానికి ఆయన అందించిన సేవలు ప్రపంచ వైదారోగ్య చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి.
కృష్ణకుమార్ వేపకొమ్మ, విశ్రాంత ప్రిన్సిపల్, హైదరాబాద్






