11 August, 2026 | 4:05 AM

సర్ రెండో దశ కీలకం

11-08-2026 12:33 AM
  1. అభ్యంతరాలపై అప్రమత్తంగా ఉండాలి
  2. ఉదాసీనత బీఎల్‌వోలను తొలగించండి
  3. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
  4. పార్టీ నేతలతో జూమ్ మీటింగ్

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో రెండో దశ అత్యంత కీలకమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ దశలో అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని, పార్టీకి చెందిన బీఎల్‌వోలు మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.  సోమవారం ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.

కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎస్‌ఎస్‌ఏ కోఆర్డినేటర్ గంప వేణుగోపాల్, కో ఆర్డినేటర్ రాజేష్, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్లమెంట్, అసెంబ్లీ, సర్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.

సర్ మొదటి దశ ప్రక్రియ పూర్తయినందున, మంగళవారం నుంచి రెండో దశ ప్రారంభమవుతుందని తెలిపారు. కాంగ్రెస్‌కు అనుకూల వర్గాల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని, అభ్యంతరాలను నిశితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. ఉదాసీనంగా వ్యవహరించే బీఎల్‌వోలను తొలగించి, కొత్తవారిని నియమించాలని పార్టీ నేతలకు సూచించారు.  

ఓపీఎస్‌పై సీఎంతో మాట్లాడుతా 

పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)పై సీఎం, డిప్యూటీ సీఎంతో మాట్లాడుతానని టీపీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీకాంత్ మహేష్‌కుమార్‌గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.  ఓపీఎస్ అంశం మా ఎజెండాలో ఉందని, త్వరలో  సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని మహేష్‌కుమార్‌గౌడ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లికార్జున్, హైదరాబాద్ జిల్లా కోశధికారి శ్యాంసుందర్  పాల్గొన్నారు.