16-07-2025 01:23:44 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): తన మూలకణాలు దానం చేసి, తన అన్నకు ప్రాణదానం చేసింది ఓ పదేళ్ల చెల్లి. ఈ సుందర దృశ్యానికి నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో గల కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వేదికైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్, బోన్మారో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణురాలు డాక్టర్ చందన మారెడ్డి తెలిపారు.
“వరంగల్ ప్రాంతానికి చెందిన పేద కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలుడికి అరుదైన అప్లాస్టిక్ ఎనీమియా వచ్చింది. ఈ వ్యాధి పది లక్షల మంది పిల్లల్లో 6.8 మందికి మాత్రమే వస్తుంది. ఆస్పత్రికి వచ్చే సమయానికి ఆ బాలుడు తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నాడు. పైపెచ్చు రక్తంలో హెమోగ్లోబిన్, ప్లేట్లెట్లు, న్యూట్రోఫిల్స్.. ఇలాంటివన్నీ బాగా తక్కువ స్థాయిలో ఉన్నాయి.
పూర్తిస్థాయి పరీక్షలు చేసిన తర్వాత అతడికి సివి యర్ అప్లాస్టిక్ ఎనీమియాగా నిర్ధారించాం. అతడికి మూలకణ చికిత్స చేస్తే తప్ప నయం కాదని నిర్ణయించిన తర్వాత సమీప బంధువుల్లో ఎవరైనా ఇవ్వాలని చెప్పాం. అప్పుడు పదేళ్ల వయసున్న అతడి చెల్లెలు.. ధైర్యంగా ముందుకొచ్చింది. దాంతో ఆమె రక్తంలోంచి మూలకణాలు సేకరించి, వాటిని అతడికి ఎక్కించాము.
ఆ బాలుడు అపార ధైర్యంతో చికిత్స చేయించుకున్నాడు. సాధారణంగా ఇలాంటి చికిత్సలకు చాలా ఎక్కువ ఖర్చవుతుంది. అయితే, ఈ కేసులో ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో ఆస్పత్రి నుంచి చాలా భారీగా రాయితీలు ఇచ్చి చికిత్స చేశాం. అంతా బాగుండడంతో బాలుడిని డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ చందన మారెడ్డి తెలిపారు.
“ఈ చికిత్స ప్రక్రియలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ నిపుణులు డాక్టర్ అవినాష్, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ విద్య, రేడియేషన్ ఆంకాలజీ బృందం, ల్యాబ్ సిబ్బంది, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అందరూ పూర్తిస్థాయిలో పాల్గొన్నారు. పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీఐసీయూ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ శంకర్రావు డెకాటే, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి.సుధీర్ తదితరులు అన్ని విభాగాల వైద్యులను ఈ బాలుడి చికిత్సలో నిమగ్నం చేయడంతో బాలుడు త్వరగా కోలుకున్నాడు” అని ఆమె వివరించారు.