27 March, 2026 | 5:06 PM

అంబరాన్నంటిన సీతారాముల కళ్యాణం

27-03-2026 03:16 PM

* తనివితీరా వీక్షించిన భక్తజనం

* భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

* ఏడుపాయల దేవస్థానం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ

పాపన్నపేట: మండల కేంద్రం పాపన్నపేటతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా సాగిన వివాహ తంతు భక్తజనాన్ని పులకింపజేసింది. ఉదయం గణపతి పూజ, పుణ్యహ వచనం, కళ్యాణ మహోత్సవం అనంతరం ఓడి బియ్యం, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కనులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

పాపన్నపేట గడికోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి శ్రీ ఏడుపాయల వనదుర్గామాత దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం పాపన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై ఎడ్లబండ్ల ఊరేగింపు ఎంతో ఘనంగా నిర్వహించారు.