04-10-2025 09:56:05 AM
ఇంఫాల్: మణిపూర్‌లోని చురాచంద్‌పూర్(Churachandpur) జిల్లా అడవుల్లో అస్సాం రైఫిల్స్ సిబ్బంది నిషేధిత సంస్థకు చెందిన సీనియర్ కమాండర్, మరో ఐదుగురు ఉగ్రవాదులను(Militants) అరెస్టు చేసినట్లు పారామిలిటరీ దళం శనివారం తెలిపింది. అక్టోబర్ 1న జరిగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు తెలిపింది. అక్టోబర్ 1న ఆపరేషన్ సాంగ్‌కోట్ అనే కోడ్‌నేమ్‌తో కూడిన సాహసోపేతమైన అడవి ఆపరేషన్‌లో అస్సాం రైఫిల్స్ యునైటెడ్ కుకి నేషనల్ ఆర్మీకి చెందిన సీనియర్ కమాండర్ ఎస్ఎస్ లెఫ్టినెంట్ జామ్‌ఖోగిన్ గైట్ లుఫో అలియాస్ పెప్సిని అరెస్టు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అరెస్ట్ చేయబడిన వారంతా చురచంద్‌పూర్ జిల్లాకు చెందిన బోల్జోల్ గ్రామానికి చెందిన పావోలెన్‌లాల్ కిప్‌జెన్ (30), కె. ఫైజాంగ్ కమ్‌గౌలెన్ (23), లుంఖోలెన్ సింగ్సన్ (26), ఎస్ ఖైగిన్పౌ (37), ఏ. జువెనైల్ గా గుర్తించారు. వారి వద్ద నుండి M79 గ్రెనేడ్ లాంచర్ (03) మూడు బాంబులు, రెండు 5 రౌండ్లు కలిగిన 9ఎంఎం పిస్టల్స్, ఎనిమిది రేడియో సెట్లు (04) నాలుగు ఛార్జర్లతో, ఎనిమిది జతల జంగిల్ షూలు, మూడు కిలోల నల్లమందు విత్తనాలు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారి సహచరులు, సంస్థ కార్యకర్తలను పట్టుకోవడానికి మరింత దర్యాప్తు జరుగుతోంది.