09-08-2025 09:19:47 AM
చంబా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం (Himachal Pradesh) చంబా జిల్లాలో కారు ప్రమాదం సంభవించింది. చంబా జిల్లాలోని(Chamba) చురా సబ్ డివిజన్‌లోని చాన్వాస్ ప్రాంతంలో ఒక బండరాయి కొండ ప్రాంతం నుంచి పడి కారును ఢీకొట్టడంతో కారు రోడ్డుపై నుంచి 500 మీటర్ల లోయలో పడిపోయిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు సహా ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను బుల్వాస్ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాజేష్ కుమార్ (40), అతని భార్య హన్సో (36), వారి కుమార్తె ఆర్తి (17), కుమారుడు దీపక్ (15) గా గుర్తించారు.
మృతులలో హన్సో సోదరుడు హేమరాజ్ (37) కూడా ఉన్నారు. అతను సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జెసిఓ)గా పనిచేసి పక్షం రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు. ఆ కుటుంబం నుంచి లిఫ్ట్ తీసుకున్న తోటి గ్రామస్థుడు రాకేష్ కుమార్ (44) అక్కడికక్కడే మరణించాడు. రాజేష్ కుమార్ బనిఖేత్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అతని పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు. ఆ కుటుంబం రక్షాబంధన్ జరుపుకోవడానికి బుల్వాస్‌కు తిరిగి వస్తుండగా, ప్రమాదం జరిగినప్పుడు వారి ఇంటి నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. హేమరాజ్ తన చెల్లిని, బావమరిది, మేనల్లుడు, మేనకోడలిని వాళ్ళ ఇంటికి దింపబోతున్నాడు. అరుపులు విన్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను లోయలోంచి వెలికి తీయడానికి ఆరు గంటలు పట్టిందని తెలిపారు. చంబా ఎస్పీ అభిషేక్ యాదవ్ మాట్లాడుతూ..."కారులో దాదాపు 6 మంది ఉన్నారని మాకు సమాచారం అందింది. వారందరూ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, హోం గార్డ్ జవాన్ల సహాయంతో మేము అన్ని మృతదేహాలను వెలికితీశాము. అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది." అన్నారు.