09-08-2025 12:59:45 PM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్(Phone tapping) కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) నిన్న సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. శనివారం నాడు కరీంనగర్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి చర్యలు లేవని తెలిపారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కేసీఆర్ పేరు చెప్పారు.. లీగల్ నోటీసులు ఎందుకు ఇస్తారు?.. నోటీసులకు చట్టపరంగా స్పందిస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవిత కూడా అన్నారు.. నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao)కు సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేయగలరా?.. నేను, నా కుటుంబం వచ్చి దేవుడి ముందు ప్రమాణం చేస్తాం.. ఫోన్ ట్యాపింగ్ విషయం తెలియదని కేటీఆర్ ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) నేతలకు కొంచెమైనా రోషం ఉంటే పార్టీ విడిచిపెట్టాలని సూచించారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపారు. సొంత పార్టీ నేతలపైనే కేసీఆర్ కు నమ్మకం లేదన్నారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్టు(Kaleshwaram Commission Report) అసెంబ్లీలో ఎందుకు పెట్టడం.. కమిషన్ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకోవాలి కదా? అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. చర్యలు తీసుకోకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం బయటపడిందని చెప్పారు. సిట్ కు ఉన్న విచారణ పరిమితులు చాలా తక్కువని, సీఎం, హైకోర్టు జడ్జిలను సిట్ పిలిచి విచారణ చేయలేదని స్పష్టం చేశారు. మావోయిస్టులు, ఉగ్రవాదుల ఫోన్లు ట్యాప్ చేస్తే జనవరి,జులై నెలలో డిలీట్ చేయాలి.. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ప్రభుత్వం ఐదేళ్ల వరకూ డిలీట్ చేయలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాదని తెలిసి ప్రభాకర్ రావు అప్పుడు డిలీట్ చేశారని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ అందరినీ పిలిచి విచారించిందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ ను ఎందుకు పిలిచి విచారించట్లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ(Central Bureau of Investigation) విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఆర్థిక సాయం చేశారని చెప్పారు. బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి కూడా కేసీఆర్ డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. మీకు అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. న్యాయమూర్తులు, సినిమా, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు.