08-10-2025 01:44:53 PM
అమరావతి: ఏపీలోని కోనసీమ జిల్లాలో(Konaseema district) బుధవారం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం జరిగింది. రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్(Sri Ganapathi Grand Fireworks)లో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప అనపర్తి ఆస్పత్రికి తరలించారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో సిబ్బంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో హూటాహుటిన బాణసంచా తయారీ కేంద్రానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న రామచంద్రపురం ఆర్డీవో అఖిల ఘటనాస్థలిని పరిశీలించారు. మందుగుండు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయం తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.