calender_icon.png 24 August, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృత్తి నైపుణ్యానికి స్కిల్ వర్సిటీ

05-12-2024 02:04:28 AM

*నియోజకవర్గానికో ఐటీఐ అడ్వాన్స్ ట్రేడ్ సెంటర్

*మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

పెద్దపల్లి, డిసెంబర్ ౪ (విజయక్రాంతి): ఏడాది పాలనలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. యువ వికాస కార్యక్రమంలో 9 వేల  మందికి నియామక పత్రాలు అందిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గత పదేళ్లలో టీచర్ల నియామకం జరగలేదని.. ప్రజా ప్రభుత్వం 11 నెలల్లోనే 11 వేలకు పైగా ఉపాధ్యాయులను భర్తీ చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్,  మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో వేలకోట్ల కొత్త పెట్టుబడులతో రాష్ట్రంలో లక్షల మంది యువతకు ఉపాధి కల్పించామని స్పష్టం చేశారు.

మహిళా సంఘాల ద్వారా మరిన్ని వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వేలకోట్లు వడ్డీ లేని రుణాల అందిస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృత్తి నైపుణ్యం కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో ఐటీఐ అడ్వాన్స్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రామగుండంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్‌ప్లాంట్ మంజూరుకు, రామగుండంలో ఎయిర్‌పోర్ట్ మంజూరుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేల చొరవతో  పాలకుర్తి ఎత్తిపోతల పథకం పత్తిపాక రిజర్వాయర్  నిర్మాణానికి డీపీఆర్ తయారు చేస్తున్నామన్నారు. దేశంలో అత్యధికంగా వరి పంట పండింది తెలంగాణలోనని.. కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలో లేకున్నా 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించామని వివరించారు. ప్రతి గింజకూ మద్దతు ధర వచ్చేలా చర్యలు చేపట్టామని.. సన్న రకానికి క్వింటాకు రూ.500 బోనస్ అందుతుందని చెప్పారు. రబీలోనూ సన్నాలకు రూ.500 బోనస్ కొనసాగుతోందన్నారు.