24 July, 2026 | 3:00 AM

చిన్న సినిమాల్లోనే దమ్ముంటుంది

24-07-2026 12:00 AM

సీనియర్ స్టార్ నటి విజయశాంతి

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ ‘కర్మాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు. ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య ఇతర ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేడుకకు సీనియర్ స్టార్ నటి విజయశాంతి ముఖ్యఅతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ.. “అభి గుండు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నిజానికి చిన్న సినిమాల్లో దమ్ముంది, సబ్జెక్ట్ ఉంటుంది. మేమందరం చిన్న సినిమాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చాం. మంచి సబ్జెక్ట్ ఉన్న చిన్న సినిమాలను విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరుతున్నా” అన్నారు.

దర్శకుడు అభినయ కృష్ణ మాట్లాడుతూ.. “ప్రేక్షకులు ఈ సినిమా చూసి 100 శాతం థ్రిల్ అవుతారని నమ్ముతున్నా. ఈ సినిమాకు హిట్ టాక్ రాకపోతే నేను గుండు కొట్టించుకుంటా. నా సబ్జెక్టుపై నమ్మకంతో ఈ మాట చెబుతున్నా” అని తెలిపారు. నిర్మాత వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్ మాట్లాడుతూ.. “ఓ డిస్ట్రిబ్యూటర్ మా సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేయిస్తానని భయపెట్టారు.

కానీ సునీల్ నారంగ్, నవీన్ మా సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకుని మాపై నమ్మకం ఉంచారు. మా దర్శకుడు అభినయ కృష్ణ కు తప్పకుండా అవార్డు వస్తుందని నమ్ముతున్నా” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో  అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌తోపాటు మూవీ టీమ్ కూడా మాట్లాడారు.