18 April, 2026 | 2:50 PM

రాఘవపేటలో బడిబాట కార్యక్రమం

18-04-2026 01:49 PM

మల్లాపూర్, ఏప్రిల్, 18(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ బడిబాట కార్యక్రమాన్ని స్థానిక అధికారులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తల్లిదండ్రులకు విద్య అవసరాన్ని వివరించారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని కోరారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు అవసరమైన బూట్లు, టై, బెల్ట్, కంపాస్ బాక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ తదితర ప్రత్యేక కిట్లు అందజేయనున్నట్లు తెలిపారు.

అలాగే డిజిటల్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వంటి ఆధునిక విధానాల్లో శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఉత్తమ విద్యాబోధన అందించనున్నట్లు చెప్పారు.అదేవిధంగా విద్యార్థులకు పాలు, ప్రతిరోజూ వేర్వేరు మెనూతో అల్పాహారం కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారానే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మద్దెల నర్సయ్య, గ్రామ కార్యదర్శి మెహన్, వార్డు సభ్యులు అమీనుద్దీన్, నత్తిరాము, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ, ఉపాధ్యాయులు జగదీశ్వర్, రాజశేఖర్, గ్రామ ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.