16 April, 2026 | 12:23 PM

పువ్వులను పరికించు

29-12-2025 12:00 AM

పువ్వులను పరికించు

పలకరించి పరవశింపజేస్తాయి

ప్రోత్సహించి కలమును పట్టిస్తాయి 

చిరునవ్వులను తిలకించు

మోములపైకెక్కి వెలుగులు చిమ్ముతాయి

పుటలపైకెక్కి పులకరింపజేస్తాయి

సుగంధాల చెంతకు వెళ్లు 

గుప్పు గుప్పుమని కప్పేస్తాయి

రయ్యి రయ్యిమని రచనలు చేయిస్తాయి

ప్రేమను చిరుగాలిగా మార్చు 

దూరమైనా దగ్గరకొచ్చి చుట్టేస్తాయి 

హృదినిపట్టేసి ఆటలాడిస్తాయి

మాటలను గాలినిచేసి ఆకాశానికి పంపు

మేఘమై పైన చినుకులు కురిపిస్తాయి

అమృతమై మాధుర్యాలను అధరాలకందిస్తాయి

భావాలను తెంచివేయకు

చిగురించి మారాకు తొడుగుతాయి

ఫలించి లాభాలను అందిస్తాయి

మనసును మభ్యపరచి మూసేయకు

మౌనంగా పలుకులు వినిపిస్తుంది

రమ్యంగా రసాస్వాదన చేయిస్తుంది

కవితలను పఠించు ఆలకించు

చెవులను చేరి శ్రావ్యత కలిగిస్తాయి

గుండెలను చేరి ఘనతను చాటుతాయి !