23 April, 2026 | 9:24 AM

మెత్తబడ్డ జీవనన్న

27-06-2024 01:03 AM

ఢిల్లీ పెద్దల బుజ్జగింపులతో దిగొచ్చిన నేత

కొత్తవారి రాకతో పాతవారి ప్రాధాన్యం తగ్గదు 

ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని అధిష్ఠానం హామీ 

ఐక్యంగా కలిసి ముందుకెళ్లాలని సూచన 

స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలని ఆదేశం

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అలక వీడారు. పార్టీలోకి కొత్తవారు ఎందరొచ్చినా.. పాతవారికి ఎలాంటి నష్టం జరగకుండా పార్టీ చూసుకుంటుందని, ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యం ఉంటుందని ఢిల్లీ పెద్దలు హామీ ఇవ్వడంతో మెత్తబడ్డారు. దీంతో చేరికల పంచాయితీకి పుల్‌స్టాప్ పడిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరటంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకండా ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. దీంతో పార్టీ నేతలు రంగంలోకి దిగి బుజ్జగించారు.

అధిష్ఠానం ఆదేశాల మేరకు బుధవారం ఆయన హస్తినకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీతో జీవన్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సమావేశమయ్యారు. పార్టీలో చేరికల విషయంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. 40 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకు నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని జీవన్‌రెడ్డి  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాత్రికి రాత్రి కండువా కప్పారని, మరుసటి రోజు ఎమ్మెల్యే పార్టీలో చేరిన విషయాన్ని మీడియాలో చూసి తెలుసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.

దీంతో పార్టీలోకి ఎవరొచ్చినా సీనియర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని దీపాదాస్ మున్షీ భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్దకు మున్షీ, జీవన్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు వెళ్లారు. రాష్ట్రంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగానే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సి వస్తుందని, ఇతరుల చేరికతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కేసీ వేణుగోపాల్ కూడా హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తానని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ముందుగానే ఢిల్లీకి వెళ్లి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేరికలతో ఏర్పడిన పరిస్థితులను దీపాదాస్‌కు, కేసీ వేణుగోపాల్‌కు వివరించారు. దీపాదాస్ వెంటనే జీవన్‌రెడ్డికి ఫోన్‌చేసి ఢిల్లీకి రావాలని సూచించారు. జీవన్‌రెడ్డిని ఢిల్లీకి తీసుకెళ్లే బాధ్యతను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు అప్పచెప్పారు. ఆయన దగ్గరుండి జీవన్‌రెడ్డిని హస్తినకు తీసుకెళ్లారు. 

డోర్లు తెరిచే ఉన్నాయి: దీపాదాస్ మున్షీ 

కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు డోర్లు తెరిచే ఉన్నాయని దీపాదాస్ మున్షీ తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే చేరికను జీవన్‌రెడ్డి అగౌరవంగా భావించారని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అనంతరం మున్షీ మీడియాతో మాట్లాడారు. ఏ నిర్ణయం తీసుకున్నా జీవన్‌రెడ్డితో చర్చించే ముందుకెళ్తామని చెప్పారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం తగ్గకుండా చూస్తామని తెలిపారు. పార్టీలో ఎవరు కూడా అసంతృప్తిగా లేరని పేర్కొన్నారు. పీసీసీ పదవీ కాలానికి ముగింపు తేదీ అనేది ఉండదని, కొత్త పీసీసీ చీఫ్‌పై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీనే ముఖ్యం: జీవన్‌రెడ్డి 

ఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. తనకు పార్టీనే ముఖ్యమని, పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తప్పవని పేర్కొన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారని జీవన్‌రెడ్డి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తోందని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం  పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా ఒకేసరి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని తెలిపారు.

బీఆర్‌ఎస్ చేర్చుకోలేదా?

మంత్రి శ్రీధర్‌బాబు 

పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంతానికి ప్రయత్నించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజాస్వామ్య పద్ధతిలోనే వ్యవహరిస్తుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకో లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పా ర్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా? అని మీడియా ప్రశ్నించగా, ఎమ్మెల్యేల రాజీనామాలపై త్వరలోనే  పార్టీలో చర్చించి నిర్ణయానికి వస్తామని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పద అన్నారు. పార్టీలోకి కొత్తవారు ఎందరొచ్చినా సీనియర్లుకు ఎలాంటి నష్టం జరగకుండా అధిష్ఠానం చూస్తుందని పేర్కొన్నారు.