23 April, 2026 | 10:54 AM

ఇంజినీర్లనూ పట్టించుకోలేదు

27-06-2024 01:01 AM
  1. ఇష్టానుసారంగా మేడిగడ్డను కేసీఆర్ నిర్మించారు
  2. బరాజ్ డిజైన్ లోపభూయిష్టంగా రూపొందించారు
  3. మాజీ సీఎం కేసీఆర్‌పై కోదండరామ్ ఫైర్

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): మేడి గడ్డ బరాజ్ నిర్మా ణం విషయంలో ఇంజినీర్ల సూచనలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. మేడిగడ్డ బరాజ్ డిజైన్ ఒకలా.. నిర్మాణం మరోలా చేయడంతోనే కుంగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లోని టీజేఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరామ్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులు ప్రజల సొమ్మని, అవి ఎవరి బాబు సొత్తు కాదని కేసీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కమిషన్‌కు అర్హత లేదని కేసీఆర్ అనడం శోచనీయమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ ముందు తుమ్మిడిహట్టి వద్ద అంబేడ్కర్ సుజల స్రవంతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిందని, మేడిగడ్డ నిర్మాణంపై ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కాగ్ కూడా చెప్పిన విషయాన్ని ఆయన వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ మెటీరియల్ సక్రమంగా లేదని, నిర్వహణ కూడా సరిగ్గా లేదని డ్యామ్ సేఫ్టీ అధికారులు తమ నివేదికలో చెప్పారన్నారు. విచారణ కమిషన్లను రద్దు చేయించి వాస్తవాలను బయటకు రాకుండా బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం లోపభూయిష్టంగా జరిగిందని కాగ్ కూడా స్పష్టం చేసిందన్నారు.

జస్టీస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాలపై తాము రెండు సార్లు పూర్తి సమాచారంతో నివేదికను సమర్పించామని ఆయన చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద ఇప్పటికే రూ.800 కోట్ల ఖర్చుతో కాలువ పనులను చేపట్టారని, ఇక్కడి నుంచి నీటిని తీసుకునే అవకాశాన్ని పరిశీలించాలని కమిషన్‌ను కోరినట్లు వివరించారు. తుమ్మిడిహట్టిని అలాగే వదిలేయకుండా పునఃపరిశీలించాలని కోరారు. బొగ్గు గనులను సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

ఉద్యమకారులపై ఉన్న కేసులను తొలగించకుండా...

పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్.. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను తొలగించేందుకు ప్రయత్నించకుండా, తనపై ఉన్న రైల్వే కేసును రద్దు చేయాలనడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఈ కేసులో తానూ ఉన్నానని, ఎంతో మంది పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తన ఒక్కన్ని మినహాయిస్తే చాలన్నట్లుగా  కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీడియా సమావేశంలో టీజేఎస్ నాయకులు పీఎల్.విశ్వేశ్వరరావు, బైరి రమేష్, నిజ్జన రమేష్, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.