22 July, 2026 | 2:00 AM

భద్రకాళి రాజగోపుర నిర్మాణానికి భూమి పరీక్షలు

22-07-2026 12:19 AM

వరంగల్ (మహబూబాబాద్) జులై 21 (విజయక్రాంతి): చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానానికి నాలుగు వైపులా మాడవీధుల నిర్మాణం జరిపే క్రమంలో అమ్మవారి ఆలయానికి తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలలో నాలుగు రాజగోపురాలు నిర్మాణం చేయడానికి ధర్మకర్తల మండలి నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి సదరు నిర్మాణమునకు గత సంవత్సరం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా నురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి పశ్చిమం, తూర్పు వైపున దేశంలోనే అత్యంత ఎత్తయిన (9 అంతస్తుల) రాజగోపురం, తూర్పు దిశలో ఏడు అంతస్తుల రాజగోపురాన్ని కాకతీయ శైలిలో నిర్మాణం చేయడానికి ప్లాన్లు ఎస్టిమేట్లు రూపొందించారు.

ఈ నిర్మాణానికి నిర్దేశించిన భూమి యొక్క ధృడత్వాన్ని పరిశీలించడానికి సాయిల్ టెస్ట్ చేయడానికి అంజీ జియో సొల్యూషన్స్ సంస్థకు ఇట్టి బాధ్యతలు అప్పగించారు. ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఆలయ ప్రాంగణంలో భూమి పరీక్ష కార్యాచరణ ప్రారంభించారు.

ప్రతి 1.5 మీటరు లోతులో మట్టిని సేకరించి సాయిల్ టెస్ట్ జరుపుతారు. నదరు రిపోర్టు ప్రకారం రాజగోపురానికి వేయవలసిన పునాది ప్రమాణాలను నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ ఇంజనీరిగింగ్ సెల్ కు చెందిన సహాయ స్థపతి ఎడ్ల శివశంకర్, ఆలయ పర్యవేక్షకులు కూచన హరినాధ్, ప్రధానార్చకులు భద్రకాళి శేషులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు భూమి పరీక్ష కార్యక్రమం కొనసాగుతుందని అంజీ జియో సొల్యూషన్స్ సాంకేతిక నిపుణులు తెలిపారు.