19 April, 2026 | 2:15 AM

ఒవైసీ కండ్లలో ఆనందం కోసమే..

19-04-2026 12:34 AM
  1. మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ చారిత్రక తప్పిదం
  2. ఆ బిల్లును ఏడు సార్లు అడ్డుకుంది
  3. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ వారికి మరోసారి అన్యాయం చేసిందని, ఈ బిల్లును అడ్డుకొని కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మార్గదర్శకుడు, అత్యంత సన్నిహితుడైన అసదుద్దీన్ ఒవైసీ కండ్లల్లో ఆనందం చూసేందుకు రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ఈ బిల్లును అడ్డుకున్నారని ఆరోపించారు. 30 కోట్ల మంది దక్షిణాది ప్రజల ఆకాంక్షలకు అన్యాయం జరిగిందన్నారు. ఒవైసీ కండ్లల్లో ఆనందం చూసేందుకు 70 కోట్ల మంది కండ్లల్లో మట్టికొడతారా? అని నిలదీశారు.

చట్టసభల్లోకి వెళ్లాలనే మహిళల భవిష్యత్తును అంధకారం చేశారని మండిపడ్డారు. ‘ఇది బీజేపీదో, మోదీదో, కేంద్రప్రభుత్వానిదో ఓటమి కాదని, 70 కోట్ల మంది మహిళలను ఓడించారు’ అని ఆగ్రహించారు. ఈ బిల్లును కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఇప్పటివరకు ఏడుసార్లు అడ్డుకున్నాయని తెలిపారు. దక్షిణాదికి న్యాయం జరిగేలా మోదీ మంచి ఫార్ములాను తీసుకొచ్చారని, కానీ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకొని కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేసిందన్నారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహ కాంగ్రెస్‌లో కనిపిస్తోందని తెలిపారు. శనివారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు.

అనేక రోజులుగా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన చట్టం, మహిళా రిజర్వేషన్ చట్టంలో సవరణలు పార్లమెంటులో వీగిపోవడం దురదృష్టకరమన్నారు. ఆ పార్టీలు మహిళాద్రోహులుగా నిలిచిపోతాయని ధ్వజమెత్తారు. అసలు బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పలేకపోయారని, బిల్లు పెట్టకముందు దక్షిణాదికి అన్యాయమన్నారని, 50 శాతం సీట్లు పెంచుకోవాలనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు.

అందరి సహకారం ఉంటుందనే ఆకాంక్షతో ఈ బిల్లును ప్రవేశపెడితే.. కాంగ్రెస్, మిత్రపక్షాలు మరోసారి కుట్రచేసి ఈ బిల్లును, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకున్నాయన్నారు. మోదీ, బీజేపీపై ద్వేషాన్ని.. దేశంలోని మహిళలమీద, దక్షిణాది మీద చూపించారని తెలిపారు. వారంతా దక్షిణాది ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

రేవంత్‌రెడ్డి, కేసీఆర్ తెలంగాణకు జరిగే లాభాన్ని.. వారు కూడా అడ్డుకున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళామణులకు, చట్టసభల్లోకి వచ్చి దేశానికి, సమాజానికి మేలుచేయాలనుకున్న మహిళలకు, అనేక రాజకీయ పార్టీల్లో అవకాశాలు రాని వారందరి ఆశలమీద నీళ్లు చల్లారని పేర్కొన్నారు. 

దేశ వ్యతిరేక విధానంతో రాహుల్

రాహుల్‌గాంధీ అవలంబిస్తున్న విధానం, ఆయన చేస్తున్న ప్రకటనలు.. పూర్తిగా దేశ వ్యతిరేకంగా ఉన్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి.. దేశ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్నారు. దేశంలో మతకలహాలు ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన సైనికులు చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్‌ను అవహేళన చేసేలా రాహుల్ మాట్లాడారని పేర్కొన్నారు.

సర్జికల్ స్ట్రుక్, ఎయిర్ స్ట్రుక్, ఆపరేషన్ సింధూర్ ఎలా మాయాజలమో రాహుల్ చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిని చేశారా అని సీఎం రేవంత్ ప్రశ్నిస్తున్నారని, ఆ ప్రశ్నలకు తలాతోకా లేదని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. 1948 నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పాలిస్తున్నా ఏనాడైనా ఓ మహిళను ముఖ్యమంత్రిని చేశారా అని ప్రశ్నించారు. ఏరోజైనా బీసీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణలో ముఖ్యమంత్రిని చేశారా అని నిలదీశారు. వారికి బీసీలు, మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

బీజేపీని పార్లమెంటులో ఓడించామంటున్నారని, కానీ తాము ప్రజాక్షేత్రంలో గెలుస్తూనే ఉన్నామన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలనుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు వారిని ఓడిస్తున్నామని చెప్పారు. జనగణన పూర్తయితే చాలా సమస్యలు వస్తాయని, దక్షిణాదికి న్యాయం జరగాలన్న తపనతో, ఆతృతతో మోదీ ప్రభుత్వం దక్షిణాదికి మేలు చేసే ప్రయత్నం చేస్తే దీన్ని అడ్డుకుని.. పూడ్చలేని పొరపాటు చేశారని తెలిపారు.

దక్షిణాది, ఉత్తరాది అని విభజించి పాలించేలా బీజేపీ ప్రయత్నిస్తోందంటున్న కాంగ్రెస్, రేవంత్, ఒవైసీలు ఎలాంటి ప్రతిపాదనలు ఇస్తారో చెప్పాలన్నారు.  తాము 70 కోట్ల మంది మహిళలను ఇంటింటికీ వెళ్లి కలుస్తామని, మహిళలు ఎదురు తిరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో.. త్వరలో చూస్తారని హెచ్చరించారు.