యుద్ధ ప్రాతిపదికన నీటి సమస్యకు పరిష్కారం
నిజామాబాద్, డిసెంబర్ 5 (విజయ క్రాంతి): భీంగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నీటి కొరతను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేజీ బీ వీ పాఠశాలలో సరిపడా నీటి వసతి అందుబాటులో లేక విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తక్షణ చర్యలు చేపట్టామని అన్నారు.
కస్తూర్బా పాఠశాలలో పై అంతస్తు వరకు నీరు చేరేలా పైప్ లైన్ నిర్మాణం, మరమ్మతు పనులను జరిపించడంతో పాటు, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొత్తగా బోరుబావి తవ్వించడం జరిగిందన్నారు. కాగా, కేజీబీవీలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారం విషయమై సకాలంలో స్పందించని పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కు వివరణ కోరుతూ, మెమో జారీ చేశామని డీ.ఈ.ఓ తెలిపారు.






