calender_icon.png 8 August, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి వివాహేతర సంబంధం.. మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య

08-08-2025 12:04:28 AM

  1. పలుమార్లు మందలించినా వినని తల్లి

ఆమె ప్రియుడి ఇంటి ఎదుట కొడుకు మృతదేహంతో బంధువుల ధర్నా

కోపంతో ఇంటికి నిప్పు 

మంచిర్యాల జిల్లా- ఆవుడం గ్రామంలో ఉద్రిక్తత

బెల్లంపల్లి, ఆగస్టు 7: మహిళ నెరిపిన వివాహేతర సంబంధం.. తన 20 ఏళ్ల కుమారున్ని బలి తీసుకుంది. ఈ ఘటన గురువారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఆవుడం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వివాహిత అదే గ్రామంలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న మంగళి తిరుపతి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. తిరుపతితో వివాహేతర సంబంధం మానుకోవాలని ఆమె కొడుకు దురికి అనిల్ (20) అనేకసార్లు మందలించాడు.

అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అనిల్ గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన మృతుని తండ్రి బాపు, అతని కుటుంబ సభ్యులు అనిల్ మృతదేహాన్ని ఆటో డ్రైవర్ మంగళీ తిరుపతి ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. ఇంట్లోకి వెళ్లి నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హుటాహుటిన పోలీసులతో ఆవుడం గ్రామానికి చేరుకుని అనిల్ బంధువులను శాంతింపజేశారు.