calender_icon.png 8 August, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే బీసీని పీఎం చేస్తామని ప్రకటించాలి

08-08-2025 12:06:17 AM

  1. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ముసుగు తొడుక్కున్న దొంగలు 

బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 7 (విజయక్రాంతి): బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీని ప్రధానమంత్రి చేస్తామని ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. నెహ్రూ నుంచి సోనియాగాంధీ వరకు బీసీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

అక్కడి నుంచి భువనగిరి పట్టణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, ఓ గార్డెన్‌లో జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పేరున ఆడుతున్న నాటకమని ఎద్దేవా చేశారు. బీసీ బిల్లు అమలు కాదని ముందే తెలిసే.. రాహుల్‌గాంధీ, ప్రియాంక, సోనియాగాంధీ ధర్నా వద్దకు రాలేదని విమర్శించారు.

బీసీలకు న్యాయం జరిగేది బీజేపీతోనే అని, తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ముస్లింలకు ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో, కాలేశ్వరం అవినీతి కేసులో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారులను అరెస్టు చేస్తుంది కానీ అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకులను మాత్రం అరెస్టు చేయడం లేదని అన్నారు.

రాష్ట్రానికి కేంద్రం యూరియాను సరఫరా చేయకుండా అడ్డు తగులుతుందని చేస్తున్న ఆరోపణల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నదని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు.

మూసీ నది ప్రక్షాళన చేస్తానని ముఖ్యమంత్రి జన్మదినోత్సవ నాడు ప్రకటించి ఇంతవరకు పట్టించుకోవడంలేదని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బూరా నర్సయ్యగౌడ్, గూడూరు నారాయణరెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పడమటి జగన్మోహన్‌రెడ్డి, వేముల అశోక్, జిల్లా నాయకులు పాశం భాస్కర్, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్, దాసరి మల్లేష్, చందుపట్ల వెంకటేశ్వరరావు, పోతంశెట్టి రవీందర్, చందం మహేందర్‌గుప్తా, పట్టణ పార్టీ అధ్యక్షుడు బలరాం, సుర్వి శ్రీనివాస్‌గౌడ్, మరలా నర్సింగ్‌రావు, కపిల్, సంతోష్  పాల్గొన్నారు.