10-11-2025 10:50:58 PM
గత కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ ఏఐ ఆధారిత సాఫ్ట్ వేర్ లపై మరింత దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా సాఫ్ట్ వేర్ హబ్ గా పేరున్న హైదరాబాద్ కు పలు ప్రముఖ కంపెనీలు ఏఐ సెంటర్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ఏఐ ఆధారిత డెవ్ సెక్ ఆప్స్‌లో అగ్రగామిగా ఉన్న సోనాటైప్ హైదరాబాద్ లో తన కొత్త ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించింది. ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ భద్రతా ఆవిష్కరణలో ఇది కొత్త మైలురాయిగా చెబుతున్నారు. ఏఐ ఇన్నోవేషన్, ఓపెన్ సోర్స్ సెక్యూరిటీ, 24/7 గ్లోబల్ ప్రొడక్ట్ డెలివరీ వంటి వాటికి ఇది కేంద్రంగా నిలవనుంది.
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజీవ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్య మంత్రికి ఐటీ సలహాదారుగా ఉన్న; శ్రీ సాయి కృష్ణ , సోనాటైప్ సీఈఓ భగవత్ స్వరూప్, సోనాటైప్ చీఫ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మిషెల్ జాన్సన్, సోనాటైప్ హెడ్ ఆఫ్ ఇండియా & సీనియర్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ అభిషేక్ చౌహాన్త ఇతర పరిశ్రమ ప్రముఖులు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐ, ఓపెన్ సోర్స్ ఆధారిత ఆవిష్కరణలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండడం సంతోషంగా ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుందనీ, సోనాటైప్ ఇన్నోవేషన్ సెంటర్, నగరాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మరింత బలపరుస్తుందని తెలిపారు.
మేవెన్ సెంట్రల్, నెక్సస్ రెపోజిటరి లాంటి ఓపెన్ సోర్స్ పరంపరలో మూలాలు ఉన్న సోనాటైప్, గత రెండు దశాబ్దాలుగా డెవలపర్లు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకోవడం, పంచుకోవటం, దాన్ని భద్రపరచటం వంటి కీలక అంశాల్లో అగ్రగామిగా ఉందని సోనాటైప్ CEO భగవత్ స్వరూప్ అన్నారు. ఏఐ ఆధారిత అభివృద్ధిలో భాగంగా ఈ ఇన్నోవేషన్ సెంటర్ పలు ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఇదిలా ఉంచే స్థానికంగా ఉన్న ప్రతిభకు ప్రపంచంపై ప్రభావం చూపగల శక్తి ఉందన్న సోనాటైప్ విశ్వాసానికి తమ హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్ ఉదాహరణగా నిలుస్తుందని సోనాటైప్ హెడ్ ఆఫ్ ఇండియా, సీనియర్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ అభిషేక్ చౌహాన్ చెప్పారు.