29-10-2025 02:29:30 PM
హైదరాబాద్: తుఫాన్, వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లు తాత్కాలికంగా రద్దు, మరో 14 రైళ్లు దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఫలక్ నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్(Narsapur Express)లు రద్దు అయ్యాయి. వర్షాల కారణంగా పలు చోట్ల రైల్వేస్టేషన్ లో ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ వద్ద ఉన్న పట్టాలు వర్షపు నీటిలో మునిగిపోవడంతో హైదరాబాద్ వైపు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ డోర్నకల్ జంక్షన్‌లో ఆగిపోయింది. తిరుపతి వైపు వెళ్లే కృష్ణా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ మహబూబాబాద్ వద్ద నిలిచిపోయింది.
కృష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో పలు స్టేషన్లలో 12 గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి. వరంగల్-ఖమ్మం మార్గంలో వర్షాల కారణంగా గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణ మూర్తి తెలిపారు. వర్షాల కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో చాలా చోట్ల వాగులు పొంగిపొర్లడంతో రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగింది. జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరింది.