1 August, 2026 | 2:48 AM

విధి నిర్వహణలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులు

01-08-2026 01:26 AM

దోమకొండలో స్పందించిన పోలీసులను అభినందించిన ఎస్పి

కామారెడ్డి, జూలై 31 (విజయక్రాంతి): విధి నిర్వహణలో మెరుపు వేగంతో స్పందించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన దోమకొండ పోలీసులలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం అభినందించారు. డయల్-100 సమాచారం అందగానే ఆత్మహత్యకు యత్నించిన మహిళను దోమకొండ పోలీసులు కాపాడారు.

దోమకొండలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గంగయ్య, హోంగార్డు రాజులను ఎస్పీ అభినందించారు. దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను డయల్-100 పోలీసు సిబ్బంది సమయానికి స్పందించి రక్షించి, కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించిన ఘటన అభినందనీయంగా నిలిచింది.వివరాల్లోకి వెళితే.. దోమకొండ డబుల్ బెడ్రూమ్ కాలనీలో నివాసముంటున్న మహిళా గత కొంతకాలంగా కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద నివసిస్తోంది.

శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి లింగుపల్లి వైపు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తుండగా, డయల్-100కు సమాచారం అందింది.సమాచారం అందుకున్న వెంటనే పెట్రో కార్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ గంగయ్య, హోంగార్డ్ రాజు  సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను గుర్తించి సురక్షితంగా రక్షించారు.

అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులతో మాట్లాడించి ఆమెను తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ప్రజల ప్రాణాల రక్షణలో ఇదే సేవా స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ‘ఆత్మహత్య ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదు. ఏ ఆపద వచ్చినా ఒంటరిగా మానసిక వేదన అనుభవించకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100 సమాచారం ఇవ్వాలి. ప్రతి ప్రాణం అమూల్యమైనది‘ అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.