జహీరాబాద్ ఆసుపత్రికి రాష్ట్రస్థాయి గుర్తింపు
అవార్డు అందుకున్న డాక్టర్ శ్రీధర్
జహీరాబాద్, ఏప్రిల్ 9 :జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ఈ ఆసుపత్రిలో ప్రతినెల 300కు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రతినెల ఈ ప్రసవాలను ఆసుపత్రిలోని వైద్యులతో పాటు సిబ్బంది తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండడంవల్ల ఈ అవార్డు లభించింది. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం చేయడం వల్ల ప్రసవానికి ఈ ఆసుపత్రికి వస్తున్నారు.
ప్రసూతైన తల్లీబిడ్డకు మెరుగైన వైద్యం అందిస్తూ ఉండడం వల్ల ఆసుపత్రికి గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది కృషి ఫలితమే ఈ అవార్డుకు కారణమని చెప్పారు. గర్భిణీ స్త్రీలతో పాటు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ప్రతిరోజు ఆసుపత్రికి వెయ్యి మందికి పైనే ప్రజలు వైద్యం చేయించుకునేందుకు వస్తున్నారని, వారికి కూడా మెరుగైన వైద్య సేవలు అందించి అవార్డును పొందుతామని ఆయన తెలిపారు.




