రాందేవ్ రూటు మార్చారా?
- మతం కాదు.. వ్యక్తిత్వమే జాతీయవాదం
- ఏ వర్గాన్నీ వెలివేయొద్దు
- కంగనా, సనాతని వ్యాఖ్యలపై ఎదురుదాడి
- రాజకీయ వ్యూహమా? ఆలోచన ధోరణి మారిందా?
- రాజకీయ వర్గాల్లో చర్చ
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): యోగా గురువు, ఆయుర్వేద వ్యాపారవేత్త బాబా రాందేవ్ స్వరం మారిందా? మొన్నటి వరకు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ విధానాలకు అనుగుణంగా సాగిన ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఏ వర్గాన్నీ దేశం నుంచి వెలివేయొద్దని, మత విద్వేషాలకు తావివ్వకూడదని చెబుతూనే.. బీజేపీ, సనాతన ధర్మంతో ముడిపడి ఉన్న ప్రముఖులపై విమర్శలు చేయటం ఆసక్తి రేపుతోంది.
ఒకప్పుడు ‘ఇండియా అగైనస్ట్ కరప్షన్’ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, యూపీఏ సర్కార్‌ను బలహీనపరిచి, బీజేపీ అధికారంలోకి రావడానికి వాతావరణాన్ని సుగమం చేసిన రాందేవ్.. ఇప్పుడు భిన్న స్వరం వినిపించడం వెనుక కారణమేంటన్న చర్చ మొదలైంది. సోమవారం డెహ్రాడూన్‌లో ఓ హిందీ టెలివిజన్ కార్యక్రమంలో రాందేవ్ బాబా పలు కీలక వ్యాఖ్యలు చేశా రు. దేశ యువత రక్షణ, తీవ్రవాద వ్యాఖ్యలను తోసిపుచ్చడం, కేవలం నినాదాలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వం ఆధారంగా జాతీయవాదాన్ని పెంపొందించడం వంటి అంశాలపై ప్రసంగించారు.
అయితే ఆయన తన ప్రసంగం ద్వారా.. దేశం నుంచి ఏ సమాజాన్ని, ఏ వర్గాన్నీ వెలివేయకూడదని, అటువంటి ఆలోచనలు తీవ్రమైన సామాజిక అలజడికి దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ దేశం పట్ల పూర్తి భక్తిని ప్రదర్శించాలని, దేశాన్ని ఉన్నతంగా నిలబెట్టాలని పేర్కొ న్నారు. కేవలం మత రాజ్యంగా కాకుండా రామత్వ, కృష్ణత్వ, శివత్వ ఆదర్శాలతో కూడిన ఉన్నతమైన దేశంగా అభివర్ణించారు. నినాదాల వల్ల కాకుండా వ్యక్తిత్వం ద్వారానే ‘హిందూ రాష్ట్రం’గా మారుతుందని రాందేవ్ స్పష్టం చేశారు. ముస్లిం, హిందూ, క్రైస్తవ, సిక్కు ఎవరైనా సరే భారతదేశంలో భయం తో జీవించకూడదని స్పష్టం చేశారు.
‘జెన్ జీ’కి అండగా!
‘జెన్- జీ’నిరసనకారులను ‘జనరేషన్ గట్టర్’ అని వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపి కంగనా రనౌత్‌పై రాందేవ్ బాబా విమర్శలు గుప్పించారు. ఇటువంటి పదజాలం ఆమోదయోగ్యం కాదని, ఆమె వ్యాఖ్యలను పార్టీ గమనించాలని సూచించారు. యువతను దేశానికి ప్రధాన జాతీయ బలంగా అభివర్ణిస్తూ.. వారిపై ఆమె వ్యాఖ్యలను తోసిపుచ్చా రు. అలాగే బాగేశ్వర్‌ధామ్‌కు చెందిన ధీరేం ద్ర కృష్ణశాస్త్రి, జగద్గురు రాంభద్రాచార్య వంటి ప్రముఖ మత ప్రచారకుల వ్యాఖ్యలను ఖండించారు.
సనాతన ధర్మంతో ఆడుకుంటున్నారని, ముస్లింలను పాకిస్తాన్‌కు పంపాలనే ప్రకటనలను తప్పుపట్టారు. జెన్ -జీ యువతకు అనుకూలంగా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జెన్ జీ’ శారీరక, మానసిక, అంతరంగిక బలంతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. బలమైన ఆర్థిక వ్యవస్థ, ఉన్నతమైన చారిత్రక ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యుత్తమ పౌరులుగా ఎదుగుతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.జనాభా నియంత్రణ, సనాతన ధర్మ మూలాల పరిరక్షణ, మతపరమైన విద్వేషాల వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆయన వ్యాఖ్యానించారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ స్ంథలు ప్రమాణాలకు సరితూగడం లేదని రాందేవ్ విమర్శించారు.






