ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 29(విజయ క్రాంతి):ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్లతో కలిసి వందేమాతరం గీతం ఆలపించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రజలకు అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడు తూ జిల్లాలో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.జిల్లాలో 464 మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని పేర్కొం టూ, వారికి అధికారులు దత్తత తీసుకుని నెలవారీగా మందులు, పౌష్టికాహారం అం దించాలని ఆదేశించారు.చాలామంది దగ్గు, బరువు తగ్గడం, ఆరోగ్య సమస్యలను బయటపెట్టకుండా మౌనంగా బాధపడుతున్నార ని, సమాజంలో చిన్నచూపు భయంతో చికిత్సకు దూరమవుతున్నారని అన్నారు.
అలాం టి వారిని గుర్తించి అవగాహన కల్పించి సరైన వైద్య సేవలు అందించాలని సూచించారు. క్షయవ్యాధి పూర్తిగా నయం అవుతుందని, ప్రజల్లో చైతన్యం పెంచాలని తెలిపారు.యువత మాదకద్రవ్యాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్, నషా ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్ అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు మౌనంగా ఉండకూడదని, ప్రజా వ్యతిరేక చర్యలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేసి ఆకాంక్షిత జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కె. హరిత శాఖల వారీగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్కు వివరించారు.
ఎస్పీ నితికా పంత్ జిల్లాలో శాంతిభద్రతలు, మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలపై వివరించారు. అంతకుముం దు హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్న గవర్నర్కు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. రెడ్క్రాస్ సొసైటీలో సభ్యత్వం తీసుకు న్న కలెక్టర్కు ధృవపత్రం అందజేశారు. రాష్ట్ర గవర్నర్, ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి జిల్లా అధికారులు జ్ఞాపికలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆసిఫాబాద్ ఆర్డీఓ లోకేశ్వర్ రావు, జిల్లా అధికారులు, రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






