11-11-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, నవంబర్ 10 (విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, దినపత్రికలలో ప్రచురితమవుతున్న వ్యతిరేక వార్తలకు సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలు సమర్పించాలన్నారు.
83 వ్యతిరేక వార్తలకు వివిధ శాఖల నుండి తీసుకున్న చర్యల నివేదికలు రావాల్సి ఉందని, వారాంతంలోగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కి సంబంధించి వివిధ శాఖలకు సం బంధించి, ప్రజల నుండి 201 దరఖాస్తులకు పరిష్కారం పెండింగ్ లో ఉన్నాయని, యుద్ధప్రాతిపదికన వచ్చే శనివారం లోగా దరఖాస్తుల పరిష్కారం చేయాలని కలెక్టర్ అన్నారు. మంత్రుల నుండి ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి వివిధ శాఖల నుండి 152 దరఖాస్తులకు గాను, 21 దరఖాస్తులకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ అన్నారు.
నిబంధనల మేరకు దరఖాస్తుల పరిష్కారం చేయాలని, ప్రభుత్వానికి పరిష్కారం కోసం నివేదించాల్సి ఉంటే నివేదించాలని, పరిష్కారం కాని వాటిని కారణం తెలుపుతూ తిరస్కరించాలని అన్నారు. సీఎం ప్రజావాణి కి సం బంధించి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం సహేతుకంగా, న్యాయబద్ధంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.అధికారులు, సిబ్బంది హాజరు వారం వారం సమీక్ష చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిణి ని కలెక్టర్ ఆదేశించారు. రోజువారీ హాజరును గ్రూప్ లో పోస్ట్ చేస్తూ, హాజరు శాతంను సమీక్షించాలన్నారు.
ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోలు ను మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రత్యేక అధికారులు ప్రతి శుక్రవారం ధాన్య కొనుగోలు కేంద్రాలను సందర్శించి, నిబంధనల మేరకు, కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతున్నది పర్యవేక్షించాలన్నారు. సమస్యలు ఉంటే, అక్కడికక్కడే పరిష్కరించాలని, పరిష్కారం కానిచో వెంటనే దృష్టికి తేవాలని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులు తమ సందర్శనలో ఎంత మేర ధాన్యం కొనుగోలు చేసింది, ఎంత మేర రవాణా చేసింది, ఎంత మేర మిల్లర్లు దిగుబడి చేసుకుంది, ఎంతమేర ట్యాబ్ ఎంట్రీ ఎంత మేర జరిగింది పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రత్యేక అధికారుల తనిఖీకి సంబంధించి చెక్ లిస్ట్ రూపొందించాలన్నారు.ఈ సమీక్ష లో జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, డిఆర్డీవో ఎన్. సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.