08-12-2025 12:00:00 AM
కేంద్రం వాటా 60శాతం
రాష్ట్ర వాటా 40శాతం 9, 10తరగతుల వారికే..
కలెక్టర్ ప్రత్యేక దృష్టి
నిజామాబాద్, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ, 10వ తరగతి చదువుతున్న బీసీ ఈబీసీ విద్యార్థులకు అందిస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం అమలుపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ ఆర్థిక సహాయం అందేలా చూసేందుకు, కలెక్టర్ గారు స్వయంగా ఈ దరఖాస్తు ప్రక్రియను రోజువారీగా సమీక్షిస్తున్నారు.
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఏటా 4,000/- ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2.0 లక్షలు మించకూడదు.అయితే, దరఖాస్తుకు అత్యవసరమైన కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం లను ’మీ సేవా’ కేంద్రాల ద్వారా పొందడంలో జాప్యం ఎదురవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధృవీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు ఎదురవుతుండటం వల్ల దరఖాస్తు ప్రక్రియ నిదానంగా సాగుతోందని వారు వాపోతున్నారు.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, జిల్లా రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, తద్వారా విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు సహకరించాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది. ఈ పథకంపై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను చైతన్యపరచడంలో జిల్లా విద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారులు, మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల (హెడ్ మాస్టర్లు) పాత్ర అత్యంత కీలకం. అర్హత కలిగిన విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకునేలా చూడటం వారి ప్రాథమిక బాధ్యత.
ఇందుకోసం పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, దరఖాస్తుకు అవసరమైన పత్రాల సేకరణలో విద్యార్థులకు సహాయం అందించడం వంటి చర్యలు చేపట్టాలని కలెక్టర్ కార్యాలయం విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. అర్హులైన విద్యార్థులు తమ ఆధార్ వివరాలు మరియు ఆధార్ సీడింగ్ చేయబడిన బ్యాంక్ ఖాతా వివరాలతో సిద్ధంగా ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉంటుంది. విద్యార్థులు అధికారిక TG ePASS పోర్టల్ అయిన https://telanganaepass.cgg.gov.in/https://telanganaepass.cgg.gov.in ను సందర్శించి, పై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేయాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రింటౌట్ను, అవసరమైన అన్ని పత్రాలతో పాటు పాఠశాలలో సమర్పించవలసి ఉంటుంది. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సందేహాల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది.