పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు
వర్ధన్నపేట, మార్చి 19, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో మురికి కాలువల శుద్ధీకరణ పనులను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వర్ధన్నపేట పట్టణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు కష్టపడుతున్న పారిశుద్ధ కార్మికులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. వారి సేవలను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని తెలిపారు.
గతంలో మున్సిపాలిటీలో ఉద్యోగాల విషయంలో కొంతమంది వద్ద డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చి తర్వాత తొలగించారనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అలాగే వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో జనాభా ప్రాతిపదికన అవసరమైన పారిశుద్ధ కార్మికులను నియమించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఓరుగల్లు నగర అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
ఆ పనులకు సంబంధించి 250 మంది కార్మికుల పోస్టులను మంజూరు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. పరిశుభ్రత అత్యంత ముఖ్యమని, పారిశుద్ధ కార్మికులతో సమావేశం నిర్వహించి వర్ధన్నపేటను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ నేతవత్ శీభారాణి రాజేందర్, కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, ఐనవోలు ఆలయ ఛైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




