20 March, 2026 | 2:06 AM

మానసిక దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

20-03-2026 12:43 AM

ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ 

హనుమకొండ, మార్చి 19 (విజయక్రాంతి): మానసిక దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వారి సమస్యలను తీసుకువెళ్లి అన్ని విధాలుగా ఆదుకునేందుకు తమ వంతు పాటు పడతామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హన్మకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య,

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. కడియం ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు కొత్త బట్టలు అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ, ఎమ్మెల్యే స్వయంగా పిల్లలకు భోజనం వడ్డించి మానవతా దృక్పథాన్ని చాటిచెప్పారు. అదనంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని  అందించారు.

మల్లికాంబ మనోవికాస కేంద్రంతో కడియం కుటుంబానికి దాదాపు 25 ఏళ్ల అనుబంధం ఉందని వారు పేర్కొన్నారు. ప్రతి ఏడాది పండుగలు, ప్రత్యేక రోజులు ఇక్కడి చిన్నారుల మధ్య జరుపుకుంటూ బట్టలు, ఆర్థిక సహాయం, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. మానసిక దివ్యాంగులపై సమాజంలో ఉన్న అపోహలు, వివక్ష తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆధార్ లింకేజీ సమస్యల కారణంగా పలువురు దివ్యాంగులు పెన్షన్, వైద్య సదుపాయాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆటిజం వంటి సమస్యలపై అవగాహన కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం ఉందని, ఇలాంటి సేవా సంస్థలకు దాతలు ముందుకు రావాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఉగాది కొత్త ఆరంభాలకు ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలోని ప్రతి వర్గం గౌరవంతో జీవించేలా చేయడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగుల భద్రత, సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని అన్నారు. అలాగే మరిన్ని ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా కడియం ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు రామలీల, కళ్యాణ్, మాజీ కార్పొరేటర్ మాధవి, ఎమ్మెల్యే  సతీమణి వినయరాణి, తదితరులు పాల్గొన్నారు.