అడవులను కాపాడితేనే దేశం సుస్థిరంగా ఉంటుంది
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ అటవీ దినోత్సవం, పిచ్చుకల దినోత్సవం పురష్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొని కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అటవీ శాఖ కార్యాలయం నుండి డిగ్రీ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణపై నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ... మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించవచ్చని కళాశాలలో ఉన్న ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్రతి పుట్టిన రోజున ఒక మొక్క నాటడం అలవాటు చేసుకోవాలి” అని సూచించారు. అటవీ సంరక్షణే దేశ సంరక్షణ” అనే నినాదంతో ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. పిచ్చుకల సంరక్షణపై కూడా దృష్టి సారించాలని, ఇంటి వద్ద నీటి గిన్నెలు ఉంచడం, చిన్న గూళ్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ... “ప్రాణవాయువు లేకుండా మానవ జీవనం సాధ్యం కాదు.
అడవులు, చెట్లు మన జీవనాధారాలు. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. అటవీ శాఖ అధికారిణి నిఖిత, ఏఎస్పీ బి.చైతన్య రెడ్డి, ప్రిన్సిపల్ తదితర అధికారులు పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు తెలిపారు. పోలీస్, అటవీ శాఖ అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమావేశంలో సారధి కళాకారులు తమ గీతాలతో “చెట్టూ చెట్టమ్మను నేను… చెట్టును నేనురా… మనిషి మనుగడకు జీవం పోసే అమ్మ” వంటి నినాదాలతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అటవీ సంరక్షణ, పరిరక్షణ పోస్టర్ ను ఆవిష్కరించారు.




