చింతగుట్ట అంజన్న ఆలయంలో ఆధ్యాత్మిక శోభ
- అంగరంగ వైభవంగా వార్షికోత్సవం
- భక్తులతో మారుమోగిన హనుమాన్ నామస్వరం
నంగునూరు, మే 11: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని తిమ్మాయిపల్లి, కోనాయిపల్లి కొండపాక మండలం బందారం గ్రామ సరిహద్దుల్లో కొలువుదీరిన శ్రీ చింతగుట్ట గరుడ ఆంజనేయ స్వామి దేవాలయంలో 74 అడుగుల విగ్రహ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఆలయ ధర్మకర్త బెజుగం నర్మదా రవీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం అగ్ని ప్రతిష్ఠ, మన్యసూక్త హోమం, నవగ్రహ హోమాలు జరిగాయి. మంగళవారం అష్టదశ కలశ అభిషేకం, పూర్ణాహుతి, భారీ అన్న ప్రసాదన కార్యక్రమం తోపాటు సాయంత్రం 4 గంటలకు మూడు గ్రామాల మీదుగా స్వామివారి రథోత్సవం, బైక్ ర్యాలీతో భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు.
ఏకశిల క్షేత్ర విశిష్టత
వందల ఏళ్ల క్రితమే ఏక శిలపై హనుమంతుడు,గరుత్మంతుడు సహజసిద్ధంగా వెలిసిన అరుదైన క్షేత్రంగా చింతగుట్టకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ స్వామివారితో పాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కూడా కొలువై ఉండటం, పూర్వం మునులు ఇక్కడ తపస్సు చేశారని ప్రతీతి ఉండటం ఈ క్షేత్ర మహత్యానికి నిదర్శనం.ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో క్షేత్రపాలకుడైన నాగుపాము దర్శనమివ్వడం ఇక్కడి మరో విశేషం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో గతేడాది తెలంగాణలోనే అతిపెద్దదైన 74 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహా న్ని ప్రతిష్ఠించారు. ప్రథమ వార్షికోత్సవాల సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది.
ఆలయ అభివృద్ధిలో ధర్మకర్త కృషి
స్నేహితులు, భక్తుల సహకారంతో పాటు వ్యక్తిగతంగా కోటి రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.15 ఏళ్ల క్రితం మా అమ్మగారి మొక్కు తీర్చేందుకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ క్షేత్ర మహిమను తెలుసుకు న్నాను. ప్రథమ వార్షికోత్సవాల ముగిం పు సందర్భంగా మంగళవారం స్వామివారిని ఒంటె, గుర్రపు రథంపై ఉంచి మూడు గ్రామాల్లో ఘనంగా శోభాయా త్ర నిర్వహిస్తాం. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలి.
బెజగం రవీంద్ర ప్రసాద్ (ఆలయ ధర్మకర్త)






