22 July, 2026 | 2:00 AM

నకిలీ పత్తి బీటీ విత్తనాలు స్వాధీనం

22-07-2026 12:00 AM
  1. పెద్ద అంబర్‌పేటలో ఎల్బీనగర్ ఎస్‌ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ 
  2. రూ.10 లక్షల విలువైన 400 కిలోల నకిలీ బీటీ-3 విత్తనాల స్వాధీనం

ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 21 : అబ్దుల్లాపూర్ మెట్ లో రైతులను మోసం చేస్తూ నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో  ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి దగ్గర నుంచి రూ.10 లక్షల విలువైన 400 కిలోల నకిలీ బీటీ-3 విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రవాణాకు ఉపయోగించిన రెండు కార్లు, ఆరు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.

నిందితులు ఆంధ్రప్రదేశ్లోని పిడుగురాళ్ల నుంచి విత్తనాలను తీసుకొచ్చి, తెలంగాణ రైతులకు అధిక దిగుబడి వస్తుందని నమ్మించి కిలో రూ.2,500 చొప్పున విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఏపీ లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన  ముచ్చు పాల్ సుధాకర్ రావు, చెన్నం హనుమంతరావు(65), దేవరశెట్టి పరుశరాములు(51),  ముప్పూరు పరమేశ్వరరావు, తండ్రి: కాశీ విశ్వనాథం(48),   పూరేటి అప్పారావు(32), మోజాల అంజనేయులు(43) ముఠాగా ఏర్పడి, నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు.

వీరిపై నల్గొండ జిల్లా చుండూరు, హైదరాబాద్ లోని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్వోటీ, వ్యవసాయ శాఖ అధికారులు, అబ్దుల్లాపుర్మెట్ పోలీసులు సంయుక్తంగా పెద్ద అంబర్పేట్ గ్రామంలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న నల్గొండ ధర్మకాంటా వద్ద దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా  నకిలీ బీటీ -3 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ విత్తనాలను ఆంధ్రప్రదేశ్లోని పిడుగురాళ్ల నుండి సేకరించి, తెలంగాణలోని పత్తి రైతులకు అధిక దిగుబడి వస్తుందని, మంచి పంట వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ, కిలోకు సుమారు రూ.2,500/- చొప్పున విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అనుమతి లేని, నకిలీ పత్తి విత్తనాలను రైతులు కొనుగోలు చేయోద్దని సూచించారు. ఈ దాడుల్లో ఎల్బీనగర్ ఎస్వోటీ డీసీపీ కె.మనోహర్, ఏడీసీపీ ఎం.డి.షకీర్ హుస్సేన్, సీఐలు వి.అశోక్ రెడ్డి, కె.ప్రతాప్ రెడ్డి, ఏవో పల్లవి తదితరులు పాల్గొన్నారు.