22 July, 2026 | 2:04 AM

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ముదిరాజులను బీసీ ‘ఏ’ గ్రూపులో చేర్చొద్దు..

22-07-2026 12:00 AM

ఏపీలోని 26 కులాలను బీసీ జాబితాలో చేర్చితే 

అసలైన బీసీలకు అన్యాయం..

తెలంగాణ బీసీ ‘ఏ’ కులాల హక్కుల పరిరక్షణ సమితి

ముషీరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిన ముదిరాజ్ కులస్తులను బీసీ ’ఏ’ గ్రూపులో చేర్చవద్దని తెలంగాణ బీసీ ‘ఏ’ కులాల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ముదిరాజులను బీసీ ’ఏ’ గ్రూపులో చేర్చడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీన్ని తాము తీవ్రంగా అడ్డుకుంటామని హెచ్చరించింది. ముదిరాజులు బీసీ ’ఏ’ గ్రూపులో చేర్చిస్తే ఆ గ్రూపులో బెస్త, గంగపుత్ర, గూండ్ల కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ కులాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని పేర్కొంది.

ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలంగాణ బీసీ ’ఏ’ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. భాగయ్య,  గౌరవాధ్యక్షుడు గడప శ్రీహరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.  మల్లేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నారాయణ న్యాయ సలహాదారుడు రామానంద స్వామి,  సలహాదారులు కంటె రామచందర్ లు మాట్లాడుతూ 2015లో అప్పటి ప్రభుత్వం ఏపీకి చెందిన 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిందని, ఆ కులాలను బీసీ జాబితాలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసిందని,  దీన్ని తీవ్రంగా అడ్డుకుంటామన్నారు.

రాష్ట్ర బీసీ కమిషన్ పూర్తి నివేదికను రూపొందించి సుప్రీంకోర్టుకు పంపించాలని వారు విజ్ఞప్తి చేశారు.  బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లకు వినతి పత్రాన్ని అందజేశామని,  ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని వారు ఆరోపించారు.