ఘనంగా శ్రీ భద్రకాళి భద్రేశ్వర కల్యాణ బ్రహ్మోత్సవాలు
వరంగల్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారికి ఉదయం నాలుగు గంటలకు నిత్యాహ్నికం నిర్వహించి చతుస్థానార్చన తర్వాత అమ్మవారికి హరిద్రోత్సవం, బలి ఉత్సవం నిర్వహించారు.
ఈ రోజు ఉభయదాతలైన తెలంగాణా గౌడ సంఘం ఆహ్వానం మేరకు అనేక మంది గౌడ కులస్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ముందుగా అమ్మవారికి పట్టుబట్టలు, పూలు, పండ్లు అన్నీ శిరస్సు మీద ధరించి మేళతాళాలతో వేదమంత్రాలతో గుడిలోనికి ప్రవేశించి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి శోడషోపచారపూజ జరిపి అమ్మవారి అనుజ్ఞు గైకొని స్నపనమండపంలోకి వచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
అనంతరం వందల మంది నారీమణులచే అమ్మవారికి కుంకుమార్చన జరుపబడింది. ఆ తర్వాత గ్రహమఖం, దుర్గాహెూమం, లక్ష్మీ హోమాదులు జరుపబడ్డాయి. అటుపిమ్మట అమ్మవారికి హరిద్రోత్సవం, అమ్మవారికి బలి ఉత్సవం జరిగినది. ఈ రోజున గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొనగాని యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్, యువజన సంఘం అధ్యక్షులు ఎరుకొండ పవన్ గౌడ్, కార్పోరేటర్ పోశాల పద్మస్వామి గౌడ్, మాజీ కార్పోరేటర్ నాగపురి సంజయ్ కల్పణ, రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి గౌడ్, చింత రమేష్ గౌడ్, దూలం రాజు నీరజ, బుర్ర శ్యాంగౌడ్, దూలం శ్రీనివాస్ మరియు వివిధ జిల్లాల నుండి అనేక మంది గౌడ ప్రముఖులు పాల్గొన్నారు.
సాయంకాలం అమ్మవారికి అర్చనాదులు, సాయం జౌపానన, దీక్షా హెూమం, బలిహరణ జరుపబడిన అనంతరం అమ్మవారిని భద్రకాళి మహాత్రిపుర సుందరిగా అలంకరించి రధసేవ జరిపారు. ఈ రధసేవ ఉమ్మడి వరంగల్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్వర్యంలో నిర్వహించబడింది. వందలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారి రధాన్ని లాగుతూ భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. ఆహ్లాదకరమైన ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో అమ్మవారి గుడిలో ఈ రధసేవ జరుగుతున్నంత సేపు భద్రకాళి శరణం మమ అనే నామ స్మరణతో దేవాలయ ప్రాంగణమంతా మారుమోగింది. అమ్మవారిని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వర్రావు దంపతులు దర్శించుకున్నారు.






